ఎమ్మెల్సీ పదవులకు పల్లా, కడియం, పాడి రాజీనామాలు

ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేపధ్యంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డిలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు

  • Publish Date - December 9, 2023 / 07:34 AM IST

విధాత : ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేపధ్యంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డిలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు. శనివారం వారు తమ రాజీనామాలను శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి సమర్పించారు. ఆ వెంటనే చైర్మన్‌ గుత్తా వారి రాజీనామాలను ఆమోదిస్తున్నట్లుగా ప్రకటించారు.


నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీలుగా కడియం, పాడిలు, మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణరెడ్డిలు గతంలో ఎన్నికయ్యారు. వారి రాజీనామాలతో ఆ నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. కాంగ్రెస్‌లో చేరిన మరో మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుమళ్ల దామోదర్‌ రెడ్డి పదవికి ప్రస్తుతం డోకా లేదు.


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు రెండింటిలో ఒకటి సంఖ్యాబలం అనుసరించి కాంగ్రెస్‌కు, మరొకటి బీఆరెస్‌కు దక్కనున్నాయి. కాంగ్రెస్‌ రెండో అభ్యర్థినిక కూడా పోటీలో పెడితే ఉత్కంఠ తప్పదు. ఇక ఖాళీగా ఉన్న గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల్లో రెండు కూడా కాంగ్రెస్‌కు దక్కనున్నాయి. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల స్థానానికి, మహబూబ్‌నగర్‌ స్థానిక కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఆరు నెలల్లోపు ఎన్నిక జరుగాల్సివుంది.