విధాత: భారత రాష్ట్ర సమితి పార్టీని సాధ్యమైనన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఓటు శాతాన్ని సంపాదించి జాతీయ పార్టీగా ఎదగాలన్న పట్టుదలతో కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. బుధవారం ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్ ఆ తరువాత పొరుగు రాష్ట్రాల్లోనూ ఆఫీసులు తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా ప్రకటించిన కొద్దీ గంటల్లోనే ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఆంధ్రాలో ఎక్కడెక్కడ పోటీ చేస్తారు.. ఏ పార్టీతో పొత్తు ఉంటుంది వంటి అంశాల మీద ఇంకా ఓ నిర్ణయానికి రావడానికి టైం ఉన్నప్పటికీ ఏపీలో ఆఫీస్ అయితే తెరుస్తారని సమాచారం.
విజయవాడ సమీపంలోని జక్కంపూడి వద్ద దాదాపు 1000 చదరపు గజాల స్థలాన్ని గుర్తించిన బీఆర్‌ఎస్ నేతలు అక్కడ ఆఫీసు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిసెంబరు 18, 19 తేదీల్లో విజయవాడకు వచ్చి స్థలాన్ని ఖరారు చేస్తారని అంటున్నారు.
త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా పార్టీకి జిల్లా, రాష్ట్ర కమిటీలు వేసి సీరియస్‌గానే కార్యక్రమాలు చేపట్టి ప్రజా మద్దతు పొందేందుకు ప్లాన్స్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత కర్ణాటకలోని బెంగళూరులోనూ ‘బీఆర్ఎస్’ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
కర్ణాటక బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్‌ను నియమించి ఆ రాష్ట్రంలోనూ విస్తరించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఆంధ్ర రాజకీయాల్లో కేసీఆర్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తారని అంటున్నారు. ఇక వైసిపితో పొత్తులు, అవగాహన వంటివి ఉంటాయా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.