KTR | నిరుద్యోగులను మోసం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం

సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులను, రైతులను మోసం చేస్తుందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.

  • Publish Date - April 16, 2024 / 05:20 PM IST

హామీలపై మాటమార్పు
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌

విధాత : సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులను, రైతులను మోసం చేస్తుందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆరెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ లక్షా 63 వేల ఉద్యోగాలను గతంలో బీఆరెస్ ప్రభుత్వం ఇచ్చినా విద్యార్థులకు చెప్పుకోలేపోయామని, ఉద్యోగ సమస్యలపై విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయామన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదని, తాము నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలకు నియమాక పత్రాలు అందించి వారే ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. మంది పిల్లలను మా పిల్లలు అని చెప్పుకునే రకం కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. ఏడాది లో 2 లక్షల ఉద్యోగాలిస్తామన్న కాంగ్రెస్ హామీని యువతకు మనం పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో గుర్తు చేయాలని, టెట్ పరీక్ష కోసం మనం 400 ఫీజు పెట్టామని, మేము వస్తే ఫ్రీ గా ఎగ్జామ్ పెడతామన్నారని, కానీ టెట్ పరీక్ష కోసం రూ. 1000 ఫీజు పెట్టారని విమర్శించారు.

మన డీఎస్సీలో 5 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఇది దగా అని, 25 వేల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని అన్న రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు 10 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిండని తప్పుబట్టారు. టెట్, డీఎస్సీ, గ్రూప్స్ అన్ని విషయాల్లో విద్యార్థులను పచ్చిమోసం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. గ్రూప్-1 కింద 500కు ఇంకో 60 క‌లిపి 560 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చారే తప్ప కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు.

హామీలపై మాట మార్పు

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం మాట మారుస్తుందని కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న 2లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆగస్టు 15వ తేదీ తర్వాతా మాఫీ చేస్తామంటున్నారన్నారు. రైతులు కర్రు కాల్చి వాత పెడతారన్న భయంతో కొత్త వాయిదా పెట్టిండని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన రుణమాఫీ కావాలన్న, రూ. 2500 కావాలన్న, ముసలోళ్లకు రూ. 4 వేలు కావాలన్నా పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్‌ను గెలిపిస్తేనే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి అమలు చేస్తుందన్నారు. లేదంటే రేవంత్ రెడ్డి ఉన్న అన్ని పథకాలను ఎగవేయడం ఖాయమన్నారు.

లంకె బిందెలు ఉంటాయని అనుకొని వచ్చినా అన్న రేవంత్ రెడ్డి తీరు లంకె బిందెల కోసం తిరిగేటోళ్లు పచ్చి దొంగలు ఉంటారని చురకలేశారు. రైతు బంధు ఏమైందయ్యా అంటే ఓ మంత్రి చెప్పుతోని కొడుతా అంటాడని, కేసీఆర్ 70 లక్షల మంది రైతుల ఖాతాలో రూ. 70 వేల కోట్లు రూపాయల జమ చేసిండని, రైతులు ఇప్పుడు చెప్పుతో కొట్టినట్లు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరముందన్నారు. కాంగ్రెస్‌ వచ్చాక కరువును తీసుకొచ్చిందని, ఇవ్వాల గ్రామాల్లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, సాగుతాగునీరు, విద్యుత్తు కష్టాలతో మళ్లీ పాత రోజులను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందన్నారు.

గిరిజనుల కోసం కేసీఆర్ తాండాలను పంచాయితీలు చేశారని, 6 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని, సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించామని, పోడు భూములను పంచినామని గుర్తు చేశారు. కొమురం భీమ్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేసింది కేసీఆర్ మాత్రమేనని, ఇంద్రవెల్లిలో గిరిజనులను కాల్చి చంపిన కాంగ్రెస్ ప్రభుత్వం…సిగ్గు లేకుండా మళ్లీ ఇంద్రవెల్లికి వచ్చి గిరిజనులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ మీద ప్రజలు మంట మీద ఉన్నారని, కష్టపడి పనిచేస్తే ఆదిలాబాద్ గెలవటం పక్కా అని, ఆ పార్టీలు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించటమే మన పని అని తెలిపారు.

చ‌లిచ‌మీలు క‌లిసి బ‌ల‌మైన స‌ర్పాన్ని ఎలా చంపుతాయో.. అదే ప‌ద్ధ‌తుల్లో ఈ కాంగ్రెస్ అనే విష‌స‌ర్పాన్ని గులాబీ జెండా క‌ప్పుకున్న చ‌లి చీమ‌లే చావుదెబ్బ కొడుతాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. అధికారం పోగానే కొంతమంది వేరే దారులు వెతుకున్నా సరే…ఆత్రం సక్కు మాత్రం ఏ ప్రలోభాలకు లొంగలేదని,నిజాయితీ కల్గిన సక్కును ఎంపీగా గెలిపించాలని కోరారు.

Latest News