విధాత ప్రత్యేకం: తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టుగా ఉన్నది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలకుతోడు కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్ నేతలను పార్టీలోకి చేర్చుకోవడం బీజేపీని పరోక్షంగా బలోపేతం చేస్తున్నట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం ద్వారా అంతగా బలం లేని బీజేపీకి కేసీఆర్ బూస్టింగ్ ఇచ్చారు. ఫలితంగా ఆ పార్టీ ఓటు బ్యాంకును 2014లో 4.20 శాతం నుంచి 2023 నాటికి 13.90 శాతానికి పెంచుకున్నది. ఇప్పుడు బీఆరెస్‌ను బలహీనపర్చేందుకు కాంగ్రెస్ చేసే ప్రయత్నాలు బీజేపీకే లాభం చేకూర్చుతాయన్న అభిప్రాయం వినిపిస్తున్నది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 39.40 ఓట్ల శాతంతో 64 స్థానాలను కైవసం చేసుకున్నది. 37.35 ఓట్ల శాతంతో బీఆర్‌ఎస్ 39 స్థానాలకే పరిమితమైంది. ఈ రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 2.05 శాతమే. కానీ 2018లో 88 సీట్లపాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గెలిచిన కోరుకంటి చందర్, మరో స్వతంత్ర ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌లో చేరడంతో అధికారపార్టీ బలం 90కి పెరిగింది. 19 స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌లో చీలిక వచ్చి 12 మంది బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, అశ్వారావుపేట నుంచి టీడీపీ తరఫున గెలిచిన సండ్ర వెంకట వీరయ్య, మచ్చా నాగేశ్వరరావు కారెక్కారు. దీంతో అసెంబ్లీలో బీఆర్‌ఎస్ సంఖ్య 104కు చేరింది. అంత బలం ఉన్న బీఆర్‌ఎస్ 2023లో 2.05 శాతం ఓట్ల తేడా ఏకంగా 65 స్థానాలను కోల్పోయింది. ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి, ఆత్మపరిశీలన చేసుకోవడానికి బీఆర్‌ఎస్ నేతలు సిద్ధంగా లేరు. పైగా ప్రజలు పొరపాటున తమల్ని ఓడించారనో, ఆవేశంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారనో, కేసీఆర్ మళ్లా ముఖ్యమంత్రి కావాలి కానీ ఎమ్మెల్యే మాత్రం ఓడిపోవాలి అనుకున్న ఫలితమే తమ ఓటమి అని ప్రజలను, వారి తీర్పును తప్పుపడుతున్నారు. ఓటమి తర్వాత హైదరాబాద్ కేంద్రంగా నియోజకవర్గాలవారీగా సమీక్ష చేసుకున్నారు కానీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు, పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని బీఆర్‌ఎస్ అధిష్ఠానం తీసుకోలేదు. పార్టీ వైఫల్యంపై లోతుగా అధ్యయనం చేయకుండా, ఆత్మపరిశీలన చేసుకోకుండా బీఆర్ఎస్ కాలయాపన చేస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ కూడా బీఆర్‌ఎస్ నేతలపై, క్యాడర్‌పై దృష్టి సారించింది. బీఆర్‌ఎస్‌ను బలహీనపరిచి లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలువడం ద్వారా రాష్ట్రంలో రానున్నరోజుల్లో రాజకీయ, అధికార మార్పిడికి మార్గం సుగమం చేయాలన్నది ఆ పార్టీ అధిష్ఠానం ఆలోచనగా కనిపిస్తున్నది. అందుకే బీజేపీ రాష్ట్ర నాయకులతో పాటు, జాతీయ నాయకులు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమంది బీఆర్‌ఎస్ నేతలు కూడా అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. బీఆర్‌ఎస్ చేస్తున్న పొరపాట్లతో బీజేపీ బలోపేతం కావడంతో పాటు సొంత పార్టీలోనే ఏక్‌నాథ్ షిండేలను సృష్టించే విధంగా వ్యవహరిస్తున్నారనే చర్చ నడుస్తున్నది.
కాంగ్రెస్ చేయాల్సింది ఏమిటి?
బీఆర్‌ఎస్ వైఫల్యాల వల్లనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక కూడా విపక్ష నేత తరహాలోనే మాట్లాడుతున్నారనే అభిప్రాయం ఉన్నది. బీఆర్‌ఎస్‌ను, ఆ పార్టీ నేతలను టార్గెట్ చేయడం ద్వారా ఆ పార్టీ బలహీనపడుతుంది కానీ.. ఆ ఖాళీని గతంలో మాదిరిగానే బీజేపీ భర్తీ చేస్తుందని అంటున్నారు. బీజేపీకి కాస్త చోటు దొరికితే తనకున్న గవర్నర్ల వ్యవస్థ, రాజ్యాంగ సంస్థల ద్వారా ఇప్పటికి ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని పార్టీల్లో చీలికలు తెచ్చిందో అందరికీ తెలిసిందే.
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేక ఆశలున్నాయి. ఎంతసేపూ రాష్ట్రంలో అన్ని సమస్యలకు గత ప్రభుత్వ విధానాలే కారణం అని విమర్శలు చేస్తూ కాలం గడిపితే ప్రజాగ్రహం తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలు ఎప్పుడూ గతంలో కంటే వర్తమానంలో వాళ్ల ఆకాంక్షలు, ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తారు. కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్ ప్రభుత్వ తప్పులపైనే ఎక్కుగా ఫోకస్ పెట్టడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని అంటున్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విభజన సమస్యలు అనేక అపరిష్కృతంగా మిగిలిపోయాయి. తెలంగాణ అస్తిత్వాన్నే పార్లమెంటు వేదిగా అవమానపరిచిన మోదీ అదే వైఖరిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. విభజన సమస్యలపై కేంద్రంతో కొట్లాడితే తప్పా పరిష్కారం అయ్యే పరిస్థితి ఉండదు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం మంచిదే. కానీ రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కేంద్రం విధానాలుంటాయి. కాబట్టి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తుందని అనుకోవడానికి వీల్లేదు. ఆ పార్టీ మొదటి నుంచీ ఇక్కడ అస్థిరత్వాన్నినెలకొల్పి రాజకీయ లబ్ధి పొందడానికే ప్రయత్నిస్తున్నదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకోసం పనిచేయాలన్నది ప్రజాభిప్రాయం.
బీజేపీ ఏం చేయబోతున్నది?
బీజేపీ తెలంగాణలో చాపకింద నీరులా విస్తరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఆ పార్టీ మొదటి నుంచి ప్రజాభిప్రాయాన్ని అపహాస్యం చేసే చర్యలకే పాల్పడుతున్నది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ గతంలో గెలిచిన 4 సీట్లకు అదనంగా మరో నాలుగైదు సీట్లు దక్కించుకుంటే రాష్ట్రంలో చాలా మార్పులు జరుగుతాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ కాషాయపార్టీ తాను ఇక్కడ చేయాలనుకునే రాజకీయ ప్రయోగానికి అస్త్రాలు, ఆయుధాలను సమకూరుస్తున్నదనేది వారి వాదన. అదే జరిగితే తెలంగాణ రాష్ట్రానికి, ప్రజానీకానికి పూడ్చలేని నష్టాన్ని కలుగజేస్తుంది. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు.