విశాఖ బిజినెస్ సమ్మిట్‌.. ఎలాన్ మస్క్‌కు ఆహ్వానం!

విధాత‌: నేను బిల్ క్లింటన్ను పిలిపించాను.. బిల్ గేట్స్ తో మీటింగ్ పెట్టాను అని అప్పట్లో చంద్రబాబు తరచూ చెబుతుండేవారు. ఇక అదే స్ఫూర్తితో జగన్ కూడా టెస్లా కార్లు అధినేత ఎలాన్ మస్క్ ను విశాఖ రావాల్సిందిగా జగన్ ఆహ్వానించారు. ఆయన వస్తారా రారా అన్నది పక్కన బెడితే ఆ స్థాయిలో బిజినెస్ సదస్సు ఏర్పాటు చేస్తున్నామని జాతీయ స్థాయిలో జగన్ ఆల్రెడీ ప్రచారం ప్రారంభించారు. మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ […]

  • Publish Date - January 6, 2023 / 02:35 PM IST

విధాత‌: నేను బిల్ క్లింటన్ను పిలిపించాను.. బిల్ గేట్స్ తో మీటింగ్ పెట్టాను అని అప్పట్లో చంద్రబాబు తరచూ చెబుతుండేవారు. ఇక అదే స్ఫూర్తితో జగన్ కూడా టెస్లా కార్లు అధినేత ఎలాన్ మస్క్ ను విశాఖ రావాల్సిందిగా జగన్ ఆహ్వానించారు. ఆయన వస్తారా రారా అన్నది పక్కన బెడితే ఆ స్థాయిలో బిజినెస్ సదస్సు ఏర్పాటు చేస్తున్నామని జాతీయ స్థాయిలో జగన్ ఆల్రెడీ ప్రచారం ప్రారంభించారు.

మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి ఎలాన్ మస్క్ సహా 15మంది కేంద్ర మంత్రులు, మరో 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 44 మంది అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక వేత్తలు, 53మంది భారతీయ వ్యాపారవేత్తలు, వివిధ దేశాల రాయబారులు రాబోతున్నారు.

ప్రధాని నరేంద్రమోదీని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. ఇక ఎలన్ మస్క్ తో పాటు యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అమెజాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జెఫ్ బెజోస్, శాంసంగ్ చైర్మన్ ఓహ్-హ్యున్ క్వాన్ ని కూడా ఆహ్వానించారు.

ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్రా, కుమార్ మంగళం బిర్లా, ఆది గోద్రెజ్, రిషద్ ప్రేమ్‌జీ, ఎన్.చంద్రశేఖరన్ వంటి భారతీయ వ్యాపారవేత్తలు కూడా ఈ కార్యక్రమానికి వస్తారని అంచనా. మీ వ్యాపారం అభివృద్ధి కోసం మాతో కలసి పనిచేయండి అంటూ ప్రపంచ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

2022లో ఏపీ ప్రభుత్వం రూ. 1,26,750 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించిందని, 2023 మరింత ఎక్కువ మేర పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రచార కార్యక్రమాలను కూడా దేశ విదేశాల్లో ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది.

జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, అమెరికా లలో రోడ్ షో లు నిర్వహించేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. దీంతో విశాఖతో బాటు ఆంధ్రప్రదేశ్ కు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం.. అలాగే వివిధరంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తే అటు అభివృద్ధితోబాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.