Delhi Liquor Scam | దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సీఏ గోరంట్ల బుచ్చిబాబు అఫ్రూవర్‌గా మారారు.
గోరంట్ల బుచ్చిబాబు గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దగ్గర అడిటర్‌గా పని చేశారు. మద్యం కుంభకోణం కేసులో సౌత్ గ్రూప్ తరపున బుచ్చిబాబు మధ్యవర్తిత్వం వహించినట్లు అభియోగాలు ఉన్నాయి.
లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే దినేశ్ అరోరా అఫ్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బుచ్చిబాబు కూడా అఫ్రూవర్‌గా మారడంతో ఈ కేసులో సంచలనం నెలకొంది. ఇకపోతే ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ తాజాగా మరో ఛార్జిషీట్ దాఖలు చేసింది.
209 పేజీలతో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. బుచ్చిబాబు అఫ్రూవర్‌గా మారడంతో ఎమ్మెల్సీ కవితపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది? ఆసక్తికరంగా మారింది. సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.