BRSలోకి తోట చంద్ర శేఖర్.. ఏపీ సారథ్యం ఆయ‌నకే!

విధాత‌: బ్యూరోక్రాట్‌గా మంచి పేరు సంపాదించిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌కు చట్ట సభల్లోకి వెళ్లాలనే కోరిక తీరినట్లు లేదు. ఇరవయ్యేళ్ల‌కు పైగా మహారాష్ట్రలో వివిధ హోదాల్లో పని చేసిన చంద్రశేఖర్ రాజకీయాల మీద ఆసక్తితో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. గతంలో రెండు పార్టీల్లో పని చేసిన ఈ మాజీ ఐఏఎస్ ఈసారి ఇంకో పార్టీలో చేరి తన సత్తా నిరూపించు కోవాలని చూస్తున్నార‌ని అంటున్నారు. గతంలో 2014లో వైఎస్సార్సీపీ నుంచి ఏలూరు ఎంపీగా […]

  • Publish Date - January 1, 2023 / 03:22 PM IST

విధాత‌: బ్యూరోక్రాట్‌గా మంచి పేరు సంపాదించిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌కు చట్ట సభల్లోకి వెళ్లాలనే కోరిక తీరినట్లు లేదు. ఇరవయ్యేళ్ల‌కు పైగా మహారాష్ట్రలో వివిధ హోదాల్లో పని చేసిన చంద్రశేఖర్ రాజకీయాల మీద ఆసక్తితో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

గతంలో రెండు పార్టీల్లో పని చేసిన ఈ మాజీ ఐఏఎస్ ఈసారి ఇంకో పార్టీలో చేరి తన సత్తా నిరూపించు కోవాలని చూస్తున్నార‌ని అంటున్నారు. గతంలో 2014లో వైఎస్సార్సీపీ నుంచి ఏలూరు ఎంపీగా బరిలోకి దిగిన తోట 5.21 లక్షల ఓట్లు సంపాదించినా ఆ ఎన్నికల్లో మాగంటి బాబు టీడీపీ తరఫున ఎంపీగా గెలిచారు.

ఆ తరువాత కొన్నాళ్లు వ్యాపారంలో బిజీగా ఉన్న ఈ మహారాష్ట్ర క్యాడర్ అధికారి తరువాత జనసేనలో కాస్త యాక్టివ్‌గా ఉన్నారు. ఇప్పుడీ తోట చంద్రశేఖర రావు జనసేన పార్టీని వీడనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో రెండవ తేదీన ఆయన కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరతారని, అదే రోజు ఆంధ్ర ప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర పేరును కేసీఆర్ ప్రకటించనున్నారు.

సోమ‌వారం ఉదయం గుంటూరు అరండల్ పేట నుండి భారీ ఎత్తున ర్యాలీతో హైదరాబాదు వెళ్ల‌నున్నారు. తోట చంద్రశేఖర్ అభిమానులు ఇప్పటికే తన సన్నిహితులతో తను జనసేన పార్టీ వీడనున్నట్లు చంద్రశేఖర్ సంకేతాలను ఇచ్చారు. రెండో తేదీన తనకు అందుబాటులో ఉండాలని వారిని కోరడం కూడా జరిగింది. జ‌నసేనలో ఆయన ప్రస్తుతం పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

తోట చంద్రశేఖర రావు బీఆర్‌ఎస్ పార్టీలో చేరికతో మరికొంత మంది అధికారులు, కాపు సామాజిక వర్గం నాయకులు రేపు తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్యలో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే విజయవాడ పరిసరాల్లో పార్టీ కార్యాలయానికి స్థలం కూడా సిద్ధమైంది. త్వరలోనే భారత రాష్ట్ర సమితి కార్యకలాపాలు మొదలవుతాయని అంటున్నారు.