ఉన్నమాట: అప్పుడెప్పుడో కొండవీటి రాజా సినిమాలో కాలు కిందపెట్టకుండా రౌడీలను చిరంజీవి చితక్కొట్టి అందర్నీ అబ్బురపరిచాడు. మొన్నామధ్య పవన్ కూడా అత్తారింటికి దారేది చిత్రంలో తనను ముట్టుకోనీయకుండానే రొడీలను రేవుపెట్టాడు.. ఇప్పుడు చంద్రబాబు కూడా కాలు బయట పెట్టకుండా.. గుమ్మం దాటకుండా కేవలం ఇంట్లో కూచుని ప్లాన్స్.. ఎత్తులు..పై ఎత్తులు వేస్తూ కార్యకర్తలు, నాయకులను దిశానిర్దేశం చేస్తూ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
అదేంటీ ఈయన ఇల్లు కదలకుండా ప్రచారం ఎలా అంటారా.. అదంతా కొత్త స్టయిల్..గత ఎన్నికల్లో ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఇలాగే.. జస్ట్ ఇంట్లో కూచుని పార్టీని విజయతీరాలకు చేర్చారు. కాబట్టి అదే తీరులో చంద్రబాబు కూడా చేయాలని అనుకుంటున్నారట. ఈమేరకు పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు సారథ్యంలో ఓ బృందం ఒరిస్సా వెళ్లి నవీన్ పట్నాయక్ పార్టీ పని చేసిన విధానాన్ని అధ్యయనం చేసి వస్తుందట.. మరి ఆ స్టయిల్ ఇక్కడ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.
మొన్న ఆమధ్య చంద్రబాబు పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తే చాలామంది రాలేదు.. ఇలా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని వారిమీద ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు రానున్న ఎన్నికల్లో జగన్ను ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇటీవల చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ ప్రారంభించారు. ఈ విషయాన్ని ముందు రోజే కొందరు నాయకులకు సమాచారం కూడా అందించారు. అయితే వీరిలో సగం మంది కూడా ఈ టెలిఫోన్ సమావేశానికి రాలేదు.
వివిధ కారణాలతో తప్పించుకున్నారు. దీనిపైనా చంద్రబాబు కూపీ లాగారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే ఆయన వివిధ రూపాల్లో కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆయన నాలుగు నెలలపాటు ప్రజల్లో ఉండేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. అంతే కాకుండా కొత్త పద్ధతుల్లో పార్టీని ఎలా గెలిపించాలన్నదానిమీదా కసరత్తు చేస్తున్నారు.
ఇందులో భాగంగా చంద్రబాబు జిల్లాల్లో తిరగడం కన్నా వ్యూహాలు రూపొందించడం… నేతలకు దిశా నిర్దేశం చేయడం వంటి పనులు చేయాలని ..మిగతా వ్యవహారం తాము చూసుకుంటానని నాయకులు అంటున్నారట. గత ఎన్నికలకు ముందు ఒడిశాలో బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ కాలు బయటకు పెట్టలేదు. జిల్లాల్లో తిరగకుండానే జస్ట్ ఇంట్లో కూచుని ప్రచార వ్యూహం రూపొందించారు. ఆయన వేసిన రూట్లో నడిచిన కార్యకర్తలు పార్టీని గెలిపించారు.. ఇలా తెలివిగా నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి అయ్యారు.
అయితే నవీన్ అనుసరించిన వ్యూహం మీద అధ్యయనం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒడిశా పంపించాలని భావిస్తున్నారట. అక్కడ ఏం చేశారో తెలుసుకుని ఆంధ్రాలో కూడా అదే విధంగా చంద్రబాబు ఇల్లు కదలకుండా నేరుగా ఎన్నికల్లో గెలిచి, అట్నుంచి ఆటే ముఖ్యమంత్రి గా ప్రమాణ శ్వీకారానికి వెళ్లాలని ప్లాన్ చేశారు. చూడాలి మరి ఒడిశా తరహా ప్రచారం ఇక్కడ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.