Site icon vidhaatha

Chandrababu Naidu | చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ డిస్మిస్‌ చేసిన హైకోర్టు..! ‘సుప్రీం’కు వెళ్లే ఆలోచనలో టీడీపీ నేతలు..!

Chandrababu Naidu | తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. రూ.300కోట్లకుపైగా స్కామ్‌ కేసులో ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఆయనకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన విషయం తెలిసిందే.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో రిమాండ్‌ చెల్లదంటూ తెలుగుదేశం అధినేత హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే, ఈ వాదనలు హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. సీఐడీ వాదనలతో హైకోర్టు ఏకీభవించి.. క్వాష్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. ఈ కేసులో అరెస్టు, రిమాండ్‌ సక్రమేనని కోర్టు స్పష్టం చేసింది. 17ఏ సెక్షన్‌ కింద అరెస్టు చెల్లదన్న వాదలను హైకోర్టు అంగీకరించలేదు.

అలాగే, చంద్రబాబు తరఫున న్యాయవాదులు అసలు కేసే చెల్లదని వాదనలు వినిపించగా.. హైకోర్టు తిరస్కరించింది. అయితే, కేసులో ఆధారాలు ఉండడంతోనే హైకోర్టు క్వాష్‌ పిటిషన్‌ను తిరస్కరించిందని లాయర్లు తెలిపారు. ప్రభుత్వ ధనం ఎక్కడికి వెళ్లిందన్నది తేలాల్సిందేనని, ఖజానాకు కట్టాల్సిందేనని న్యాయవాదులు పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న వారితో పాటు జర్మనీలో ఉన్న సీమెన్స్‌ కంపెనీ వారిని సంప్రదించాల్సి ఉందన్నారు.

కేసును విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. జీఎస్టీలో రూ.41కోట్లు ఎలా ఎగ్గొట్టారనేది, నిధులు ఎలా పక్కాగా ఎటు మళ్లాయో సీఐడీ పక్కాగా ఆధారాలు సేకరించినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. క్రిమినల్‌ కేసులో విచారణ ముఖ్యమని, దర్యాప్తు తర్వాతే క్వాష్‌కు అవకాశం ఉంటుందన్నారు. కేసును దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు తేలుతాయని తెలిపారు. కేసులో చాలా లోతు ఉందని, పరిశోధనలు నిజానిజాలు నిగ్గుతేలుతాయని న్యాయవాదులు పేర్కొన్నారు.

17ఏ అన్న ఒక్క పాయింట్‌తో ఎలా గెలుస్తారని.. ఇంత కుంభకోణం అరెస్టు చేసిన విధానాన్ని ఎలా ప్రశ్నిస్తారని న్యాయవాదులు ప్రశ్నించారు. 2018 కంటే ముందే కుంభకోణం జరిగినట్టు డాక్యుమెంటరీ ఆధారాలున్నాయని, ఆరోపణలు మాత్రమేనన్న చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలను ఖండిస్తూ సీఐడీ ఆధారాలను చూపించింది. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేదన్న కారణంతో కేసు నుంచి తప్పించుకోలేరని, చట్టం ముందు అందరూ సమానమేనని సీఐడీ తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు.

మరో వైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబు ఉన్నారు. హైకోర్టు క్వాష్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి. మరో వైపు చంద్రబాబును కష్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. బుధవారమే కేసులో వాదనలు పూర్తయ్యాయి.

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ హైకోర్టులో ఉండడంతో తీర్పును శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. క్వాష్‌ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో తీర్పును వాయిదా వేశారు. దీనిపై ఇవాళ తీర్పు వెలువడే అవకాశం ఉంది. అలాగే బాబు జ్యుడీషియల్‌ కస్టడీని ఈ నెల 24 వరకు పొడిగించింది.

Exit mobile version