విధాత: కృత్రిమ మేధ(ఆర్ట్ ఫీషియల్ ఇంటెలిజెన్స్)తో తయారైన చిట్‌చాట్ ఇప్పుడు గూగుల్‌కు సవాలు విసురుతున్నది. ఇప్పటిదాకా గూగుల్ అందించిన వాటికన్నా మరింత నాణ్యమైన రీతిలో సకలం చాట్‌జీపీటీ అందిస్తుంది. ఇది కృత్రిమ మేధతో సరికొత్త ఆవిష్కరణ. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓపెన్‌ఏఐ అనే సంస్థ కృత్రిమ మేధ సాయంతో తయారు చేసిన సాఫ్ట్‌వేరే ఈ చాట్‌జీపీటీ.
ఇది ఇంటర్నెట్ లోని కోట్ల పదాలతో రూపొందిన ఏఐ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ జీపీటీ-3ని (జనరేటివ్ ప్రి ట్రైన్డ్ ట్రాన్స్‌ఫార్మర్-3) ఓపెన్‌ఏఐ ప్రకటించింది. ప్రస్తుతం 175 బిలియన్ రకాల పారామితులతో అత్యంత శక్తివంతమైన ఏఐ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌గా దీన్ని భావిస్తున్నారు. 300 బిలియన్ పదాలను దీని వ్యవస్థలో అమర్చారు.
దీంతో.. ఇప్పటిదాకా… గూగుల్‌లో అందుబాటులో ఉన్నవాటికి పది, వందరెట్ల నాణ్యతతో, స్పష్టతతో ఈ చాట్‌జీపీటీ అందిస్తుంది. ఇది మనం ఏది చెబితే దాన్ని రాత రూపంలో అందిస్తుంది. అనువాదంలో కూడా అత్యంత ఖచ్చితత్వంతో అవసరమైన దాన్ని మనకు అందిస్తుంది.
గూగుల్ మాదిరిగా ప్రశ్నలకు జవాబులు లిస్ట్ చేయటం కాకుండా.. సమాధానాలను సులభంగా అర్థమయ్యేలా రాత రూపంలో ఇస్తుంది. చాట్‌జీపీటీ గొప్పతనం ఏమంటే.. మనకు అవసరమైన వ్యాసాలను, రీ సెర్చ్ పేపర్లను కూడా రాసిస్తుంది. మనకు కావలసిన వాటిని టాపిక్ చెప్తే కవిత, లేఖలను కూడా రాసి ఇస్తుంది.
మనం ఏ భాషలో మాట్లాడినా తక్షణమే వాటిని అర్థం చేసుకొని సమాధానాలు ఇస్తుంది. మనకు ఎవరూ తోడు లేనట్లు మనం ఫీలయితే.. మనకు కబుర్లు చెబుతుంది, జోక్‌లు వేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మన ఎదురుగా మనిషి కూర్చొని సమాధానమిచ్చినట్లు.. మనం ఏది అడిగానా దానికి సరైన శాస్త్రీయమైన సమాధానమిస్తుంది.
ఇదే ఇవ్వాళ.. గూగుల్‌కు పోటీ అంటున్నారు. అందరూ అనుకొంటున్నట్లుగానే ఇక ముందు గూగుల్, సెర్చ్ ఇంజిన్, గూగుల్‌మ్యాప్, గూగుల్ ఫోటోస్ తదితరాలన్నీ గతాలుగా మారిపోనున్నాయా అంటే.. ఔననే అంటున్నారు సాఫ్ట్ వేర్ నిపుణులు.
చాట్‌జీపీటీ… ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నా.. రెండు వారాల్లోనే పది లక్షల యూజర్లను సంపాదించుకొన్నది. ఇదింకా పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే.. ఏంటని గూగుల్‌కు గుబులు పట్టుకొన్నది. అందుకే.. ఇప్పటి నుంచే కృత్రిమ మేధతో మరింత శక్తివంతమైన లాంగ్వేజ్‌ను అభివృద్ధి చేసేందుకు గూగుల్ కూడా సమాయత్తమవుతున్నదట.