పిచ్చుకలను చంపినందుకు.. నాలుగున్నర కోట్ల మంది బలి.. ఎక్కడ?!

ప్ర‌కృతితో మాన‌వులది అనిభావ సంబంధం.. ప్ర‌కృతిని మ‌నిషి కాపాడితే.. అది స‌మ‌స్త జీవ‌రాశిని కాపాడుతుంది

  • Publish Date - January 10, 2024 / 07:32 AM IST

  • పంట ధాన్యాన్ని తింటున్నాయ‌ని
  • 1958లో పిచ్చుక‌లపై చైనా యుద్ధం
  • సుమారు 30 లక్షల పిచ్చుకల‌ హ‌తం
  • 1958-61 సంవ‌త్స‌రంలో తీవ్ర కరువు
  • ఆకలితో 4.5 కోట్ల మంది మ‌ర‌ణం

విధాత‌: ప్ర‌కృతితో మాన‌వులది అనిభావ సంబంధం.. ప్ర‌కృతిని మ‌నిషి కాపాడితే.. అది స‌మ‌స్త జీవ‌రాశిని కాపాడుతుంది. అత్యాశ‌తో ప్ర‌కృతిని ధ్వంసం చేస్తే అది ప్ర‌ళ‌మై మాన‌వ‌జాతినే క‌బ‌ళిస్తుంది. జీవ వైవిధ్యాన్ని దెబ్బ‌తీస్తే మాన‌వ జీవిత మ‌నుగ‌డ‌నే ప్ర‌శ్నార్థంగా మారుస్తుంది. చైనాలో కొన్ని ద‌శాబ్దాల క్రితం స‌రిగ్గా ఇదే జ‌రిగింది. పంట ధాన్యాన్ని తింటున్నాయ‌నే సాకుతో పిచ్చుక పిట్ట‌లను ల‌క్ష‌ల సంఖ్య‌లో చైనా చంపేసింది. తన చేతితో తన కంటినే పొడుచుకుంది. చివ‌రికి ఫ‌లితం అనుభ‌వించింది. ఆ త‌ర్వాత భ‌యంక‌ర‌మైన క‌రువు సంభ‌వించి 4.5 కోట్ల మందిని బ‌లి పెట్టింది. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా కొన్ని ఉప‌శ‌మ‌న చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది.


ఇదీ చైనా పిడికెడంత పిచ్చుక క‌థ‌..


1949లో చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మావో.. తన దేశాన్ని ప్రగతి దిశగా పరుగులు పెట్టించాలని భావించారు. అప్పటి వరకు చైనా కూడా వ్యవసాధారిత దేశమే. తమ దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని మావో ప్రభుత్వం త‌ల‌చింది. పారిశ్రామిక ఉత్పత్తుల‌ను పెంచే దిశ‌లో గ్రామీణ రైతుల‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. ఎన్నో ప్రణాళిక‌లు రూపొందించింది. అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందడానికి చైనా సరికొత్త ఉద్యమాన్ని చేపట్టింది.

గ్రామీణ ప్రాంతాల్లో 5000 కుటుంబాలు ఒక్కటిగా ఏర్పడి.. వ్యవసాయం చేయాలని ప్రభుత్వం సూచించింది. పంట అధిక దిగుబడి వస్తుందని భావించింది. మొదటి సంవత్సరం ప్రభుత్వ అంచనాలు నిజం చేస్తూ.. అధిక దిగుబడిని సాధించింది. మరుస‌టి ఏడాది ప్రభుత్వ‌ లక్ష్యాన్ని రైతులు చేరలేదు. ఆహారం కొరత ఏర్పడింది. దీనికి కారణం చైనాలో ఒక పిచ్చుక ఏడాదిలో 4.5 కేజీల బియ్యం తింటున్నాయని ఈ ధాన్యం అంతా పిచ్చుకలు తినకుండా చేస్తే.. సుమారు 60 వేల మందికి ఆహారం దొరుకుతుందని అధికారులు ప్రభుత్వానికి లెక్కలు చెప్పారు.


దేశాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా తిరుగులేకుండా చేయాలని సంకల్పించిన మావో.. మూఢ‌ దేశభక్తి మత్తులో గుడ్డిగా కొన్ని కార్యక్రమాలు అమలు చేశారు. ధాన్యాన్ని తింటూ నష్టం చేస్తున్నాయన్న కారణంగా పిచ్చుకలపై ఆయన ప‌గ‌బ‌ట్టారు. 1958వ సంవ‌త్సరంలో దేశంలో పిచ్చుక‌లపై ఆయ‌న దండ‌యాత్ర ప్ర‌క‌టించారు.


ప‌ల్లెల్లో, ప‌ట్టణాల్లో ప్రజలంద‌ర్నీ పిచ్చుక‌ల‌ను చంపాల్సిందిగా అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. ఎక్కువ పిచ్చుకలు చంపిన పాఠ‌శాల‌లు, ప్రభుత్వ కార్యాల‌యాల‌కు ప్రభుత్వం బహుమతులు ఇచ్చింది. ప్రజ‌లంతా పిచ్చుకల‌ను వలలు పెట్టి పట్టుకుని చంపేశారు. మరికొందరు విషం పెట్టి.. ఇంకొందరు చెట్లపై పిచ్చుకలు వాలకుండా డబ్బులు శబ్దాలు చేస్తూ.. పిచ్చుక గూళ్ళను, గుడ్లను నాశనం చేశారు. చివరకు పిచ్చిక పిల్లని కూడా వదలలేరు. సుమారు 30 లక్షల పిచ్చుకలు వెంటాడి వెంటాడి చంపేశారు.


అస‌లు విష‌యం తెలిసి షాక్‌


మరణించిన పిచ్చుకల జీర్ణ వ్యవ‌స్థలోని ప‌దార్థాల‌ను పరిశీలించిన శాస్త్రవేత్తలు షాక్ తిన్నారు. పిచ్చుక పొట్టలో మూడు వంతులు పంట‌ల‌ను నాశనం చేసే క్రిమికీట‌కాలు ఉండ‌గా, ఒక వంతు మాత్రమే ధాన్యపు గింజ‌లు ఉన్నాయి. అయితే అప్పటికే చైనాకు జరగాల్సిన నష్టం జ‌రిగిపోయింది. పిచ్చుకలు చనిపోవడంతో మిడ‌త‌లు పంటలపై దాడి చేయడం మొదలు పెట్టాయి. పంటలు నాశనం అయ్యాయి. మిడ‌త‌ల‌ను చంప‌డానికి క్రిమి కీటకాల నాశకాలను ఎక్కువగా ఉపయోగించారు. ఫలితంగా భూమిలోని సారం తగ్గిపోయింది.


పిచ్చుకలను చంపేయడం వలన పంటలన్నీ పురుగులు పట్టి తినడానికి తిండి దొరకని ప‌రిస్థితి ఏర్పడింది. 1958-61 సంవత్సరంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. సుమారు 4.5 కోట్ల మంది మంది ఆకలితో మరణించారు. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి చైనా ప్రభుత్వం సోవియట్ యూనియన్ నుంచి 2.5 ల‌క్ష‌ల పిచ్చుకలను దిగుమతి చేసుకుంది. కానీ, చేతులు కాలిన తర్వాత ఆకులను పట్టుకున్నా ఫ‌లితం లేకుండా పోయింది. పిడికెడంత పిచ్చుక చైనా చ‌రిత్రలో చీక‌టి అధ్యాయాన్ని లిఖించింది.

Latest News