విధాత: వ్యవసాయంలో చురుగ్గా పాలుపంచుకుంటున్నప్పటికీ భారతదేశంలోని చాలా మటుకు గ్రామాల్లో మహిళలు తమ కుటుంబ వ్యవసాయ భూముల నుంచి గౌరవప్రదమైన ఆదాయాన్ని అందుకునే పరిస్థితి ఎక్కువగా ఉండదు. అయినప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి తమ తమ భర్తలు నగరాలకు వలస వెళ్లినప్పుడు, కుటుంబ సాగుభూముల భారంలో అత్యధిక భాగాన్ని మోస్తూ వారు భారతదేశపు అగ్రి ఎకానమీలో గుర్తింపు లేని హీరోలుగా పాటుపడుతూనే ఉన్నారు. భారతదేశంలో కీలకమైన వ్యవసాయ రంగం గత దశాబ్దకాలంగా గణనీయంగా వృద్ధి చెందింది. సాగు రంగానికి దేశ జీడీపీలో సుమారు 20 శాతం వాటా ఉంది. దేశీయంగా పనిచేస్తున్న వారిలో దాదాపు 45 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో దాదాపు సగం మంది మహిళలే ఉంటారు. ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో దాదాపు 80 శాతం మంది మహిళలు వ్యవసాయంలోనే ఉంటున్నారు. కుటుంబపు ఆదాయాలను మెరుగుపర్చుకోవడంతో పాటు ఈ మహిళలకు ఇంటి పనులను నిర్వర్తించాల్సిన బాధ్యతలు కూడా ఉంటాయి.
ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ లింగపరమైన చిన్న చూపు, సామాజిక ఆంక్షలు, సాంప్రదాయకంగా పోషించాల్సిన బాధ్యతల భారాలు మొదలైన వాటి కారణంగా వ్యవసాయ పరిజ్ఞానం, సాంకేతికత మహిళలకు అంతగా అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఉత్పాదకత తక్కువగా ఉంటోంది. 2023-24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం 7 ఏళ్లు పైబడిన గ్రామీణ ఆడవారిలో అక్షరాస్యత రేటు 70.4 శాతంగా ఉండగా, గ్రామీణ పురుషుల్లో 84.7 శాతం, పట్టణ ప్రాంత మహిళల్లో 84.9 శాతంగా ఉంది. 2020 మే నాటి అగ్రికల్చరల్ వేజెస్ ఇన్ ఇండియా (ఏడబ్ల్యూఐ) నివేదిక ప్రకారం వ్యవసాయంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నప్పటికీ, పురుషులు, మహిళల వేతనాల మధ్య గణనీయంగా అంతరాలు ఉంటున్నాయి. ఇలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ స్ఫూర్తిమంతంగా దేశ సేవచేస్తున్న మహిళా రైతులు ఎంతో ప్రేరణగా నిలుస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆహారానికి సంబంధించి దేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చే క్రమంలో మహిళలు వ్యవసాయంలో పాలుపంచుకునేలా ప్రోత్సహించేందుకు విధానకర్తలు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ముఖ్యంగా వ్యవసాయం అలాగే వర్ధమాన వ్యవసాయ సాంకేతికతలకు ప్రభుత్వం మద్దతునిస్తున్న తరుణంలో, వ్యవసాయంలో కీలకంగా వ్యవహరిస్తున్న మహిళల పాత్రను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తదుపరి ఎలాంటి సంస్కరణలు తీసుకోవచ్చు? మహిళల స్వయం సహాయక బృందాలను (ఎస్‌హెచ్‌జీ) రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా (ఎఫ్‌పీవో) మార్చడం మహిళల్లో పరిజ్ఞానం మరియు నైపుణ్యాలను పెంపొందింపచేయడంతో పాటు మహిళా స్వయం సహాయ సంఘాలు (SHGs) ద్వారా “సబ్‌కా సాథ్ సబ్కా వికాస్” కార్యక్రమం కింద వివిధ లక్ష్యాలను సాధించవచ్చు. విద్య, పోషణ మరియు కుటుంబ నియంత్రణ చర్యలను ప్రోత్సహించడం ద్వారా మహిళలు మరియు వారి కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలిగే శారీరక, మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ఎస్‌హెచ్‌జీలు కృషి చేయొచ్చు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సబ్‌కా సాథ్’ కార్యక్రమం ప్రశంసనీయమైనది. 2023 డిసెంబరులో విడుదల చేసిన దీనదయాళ్ అంత్యోదయ యోజన-నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (DAY-NRLM) డేటా ప్రకారం, భారతదేశంలో 90 లక్షల ఎస్‌హెచ్‌జీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 10 కోట్ల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. మహిళల నాయకత్వంలోని ఈ ఎస్‌హెచ్‌జీలను మహిళల సారథ్యంలోని ఎఫ్‌పీవోలుగా (రైతు ఉత్పత్తిదారుల సంఘాలు) గా మారిస్తే, ‘లఖ్‌పతీ దీదీలు’ లను సృష్టించే అవకాశం ఉంటుంది. ఇవి కలసికట్టుగా పంటల ఎంపిక, సూక్ష్మ రుణాల లభ్యత మరియు ఉత్పత్తి మార్కెటింగ్ వంటి అంశాలలో సభ్యులకు మార్గనిర్దేశం చేయగలవు. తద్వారా, కాలక్రమేణా మెరుగైన ఆదాయం కోసం వీటిని ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉత్పత్తి చేసే సూక్ష్మ పరిశ్రమలుగా అభివృద్ధి చేయొచ్చు. ఇది గ్రామీణ మహిళల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది.
కీలకమైన వ్యవసాయ పరికరాల లభ్యతను పెంచే కార్యక్రమాలు
చాలా మంది మహిళలు వ్యవసాయ యంత్రాలను స్వయంగా నడపడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న SMAM వంటి పథకాలు ఈ దిశగా ఒక సరైన ముందడుగులాంటివి. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం కింద, రైతులకు వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేయడానికి 50-80% వరకు సబ్సిడీ అందజేస్తున్నారు, ఇందులో మహిళా రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పథకం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నందున, మహిళా రైతులు వీటిని సులభంగా పొందేందుకు మరింత చవకైన రుణ సౌకర్యాలను ప్రభుత్వం కల్పించాలి. అదనంగా, కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, రైతులు ఈ యంత్రాలను పరీక్షించుకునే అవకాశాన్ని కల్పించాలి. వివిధ రకాల పంటలకు అనుగుణంగా, చౌకగా అందుబాటులో ఉండే పరిష్కారాలను రూపొందించేందుకు, పంట జీవితకాలం ఆసాంతం ఉపయోగపడేలా ట్రాక్టర్ల పరిధికి మించి వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలి. ఉదాహరణకు, రైస్ ట్రాన్స్ప్లాంటింగ్ టెక్నాలజీని విస్తృతంగా ప్రవేశపెడితే, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మహిళా రైతులు ఎదుర్కొంటున్న శారీరక శ్రమను గణనీయంగా తగ్గించవచ్చు.
మహిళల కోసం, మహిళల ద్వారా పరిష్కారాలను అభివృద్ధి చేయాలి
భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) తన పరిశోధనల ద్వారా ఆహార భద్రతకు తోడ్పడుతోంది. అగ్రిటెక్ స్టార్టప్‌లకు మద్దతుగా ఉంటూనే, సుస్థిరమైన మరియు వాతావరణ అనుకూలమైన సాగు విధానాలను ప్రోత్సహించేందుకు, వ్యవసాయ విధానాలను మెరుగు పర్చేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో నవకల్పనలను ప్రోత్సహించేందుకు అవసరమైనట్లుగా సాంకేతికతను ఉపయోగించుకోవడంలో కావాల్సిన మద్దతును కూడా అందిస్తోంది. భారతదేశంలోని 113 సంస్థలు మరియు 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాల నెట్వర్క్ ద్వారా రైతులకు ICAR సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. అయితే, ఈ కేంద్రాలు మరింత మంది మహిళా రైతులను చేర్చుకునే దిశగా చేయాల్సిన కృషి చాలా ఉంది. అలాగే వ్యవసాయంలో మహిళలకు సంబంధించిన విద్యను, వారికి అనుకూలమైన వ్యవసాయ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసే పనిని వేగవంతం చేయాలి. కృత్రిమ మేధస్సు (AI), మెషిన్ లెర్నింగ్ (ML), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను వ్యవసాయ రంగంలో విస్తృతంగా ప్రవేశపెట్టడం ద్వారా మహిళా రైతుల జీవితాల్లో మార్పు తేవచ్చు.
ప్రైవేట్ రంగం కూడా మహిళా రైతుల కోసం రూపొందించిన వ్యవసాయ సొల్యూషన్స్‌ను తక్కువ ధరలో, అందుబాటులోకి తేవడంలో కీలక పాత్ర పోషించగలదు. గ్రామీణ మహిళల్లో సమ్మిళితత్వ భావన పెంపొందించడానికి, అలాగే వ్యవసాయంలో మరింతగా పాలుపంచుకోవడానికి, ప్రధాని ‘వికసిత భారత్’ లక్ష్య సాధనలో తోడ్పడటానికి మరిన్ని కొత్త ఆవిష్కరణలను చేయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో, గ్రామీణ ప్రాంతాల్లో లింగ సమతుల్యతను మెరుగుపరిచే ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయడంపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మహిళా రైతుల దృక్పథానికి పాలసీలు, పరిశోధనల్లో సమగ్రంగా చోటు కల్పించాలి. ప్రపంచానికి బ్రెడ్‌బాస్కెట్‌గా ఎదిగే క్రమంలో భారతదేశ ప్రతిష్టను ఇనుమడింప చేస్తూ, దేశ సమగ్ర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయ రంగంలోని మహిళల పురోగతి, వృద్ధి కూడా అనుసంధానించబడాలి.