చైనా ప్ర‌జ‌ల‌కు కోపం తెప్పించిన ఎగ్ ఫ్రైడ్ రైస్ వీడియో.. కార‌ణ‌మేమిటంటే..

ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన వీడియోను ఆన్‌లైన్‌లో పెట్టిన చెఫ్‌కు ఓ దేశ ప్ర‌జ‌లు చుక్క‌లు చూపించారు. ఆ చెఫ్ కూడా అలాంటి ఇలాంటి వ్య‌క్తి కాదు

  • Publish Date - November 30, 2023 / 10:08 AM IST

విధాత‌: ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన వీడియోను ఆన్‌లైన్‌లో పెట్టిన చెఫ్‌కు ఓ దేశ ప్ర‌జ‌లు చుక్క‌లు చూపించారు. ఆ చెఫ్ కూడా అలాంటి ఇలాంటి వ్య‌క్తి కాదు. వారంతా అభిమానించే ప్ర‌ముఖ చెఫ్ కూడా. అయినా ఈ విష‌యంలో వారు వెన‌క్కు త‌గ్గ‌లేదు. ఎగ్ ఫ్రైడ్ త‌యారీ వీడియోను అప్‌లోడ్ చేసినందుకు క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే అంటూ ఆన్‌లైన్‌లో ఒక ఉద్య‌మ‌మే చేశారు.


దీంతో దిగివ‌చ్చిన స‌ద‌రు చెఫ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పుకొని.. ఆ వీడియోను తొల‌గించాడు. విచిత్ర‌మైన ఈ ఘ‌ట‌న చైనా (China) లో జ‌రిగింది. ఆ దేశంలో మంచి పేరున్న చెఫ్ వాంగ్ గాంగ్‌.. న‌వంబ‌రు 27న ఒక చ‌క్క‌టి ఎగ్ ఫ్రైడ్‌రైస్ (Egg Fried Rice) ను ఎలా వండుకోవాలో చెబుతూ ఒక వీడియో తీశాడు. దానిని చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ అయిన వియ్‌బోలో పోస్ట్ చేశాడు.


దీంతో ఒక్క‌సారిగా ఆన్‌లైన్‌లో ఆయ‌న‌పై యుద్ధం మొద‌లైంది. ఆ వీడియోను తీసి క్ష‌మాప‌ణ చెప్పాల్సిందేన‌ని చాలా మంది తిట్ల దండ‌కం అందుకున్నారు. వారి ఆగ్ర‌హానికి కార‌ణం చైనా ప్ర‌జ‌లు త‌మ జాతిపిత‌లా భావించే మావో జెడాంగ్‌పై ఉన్న గౌర‌వ‌మే. ఆయ‌నపై ప్ర‌జ‌ల‌కు ఉన్న గౌర‌వానికి.. ఎగ్ ఫ్రైడ్ రైస్‌పై ఉన్న కోపానికి ఒక కార‌ణం ఉంది. 1950లో జ‌రిగిన వియ‌త్నాం యుద్ధంలో జెడాంగ్ కుమారుడైన మావో ఎనీయింగ్ కూడా పాల్గొన్నారు.


ఒకానొక స‌మ‌యంలో శ‌త్రు సైన్యం త‌రుముకు వ‌స్తున్నప్పుడు చైనా సైనికులంద‌రూ పారిపోయారు. కానీ ఎనీయింగ్ మాత్రం.. అదేమీ ప‌ట్టించుకోకుండా.. ఎగ్ ఫ్రైడ్ వండ‌టం ప్రారంభించాడు. దాంతో అక్క‌డి నుంచి లేచిన పొగ‌ను గ‌మ‌నించి శ‌త్రు సైన్యం ఆయ‌న‌ను మ‌ట్టుబెట్టింది. ఇది ఒక క‌ల్పిత క‌థ అని చైనా ప్ర‌భుత్వం చాలా సార్లు చెప్పినా.. త‌మ అభిమాన నాయ‌కుడి మృతికి ఎగ్ ఫ్రైడ్ రైసే కార‌ణ‌మ‌ని చైనాలో మెజారిటీ ప్ర‌జ‌లు భావిస్తారు.


దాని పేరు ఎత్త‌డానికి గానీ.. ఆ వీడియోలు చూడ‌టాన్ని గానీ ఇష్ట‌ప‌డ‌రు. అలా ఎవ‌రైనా చేసినా దానిని త‌మ నాయ‌కుడి ప‌ట్ల అగౌర‌వంగా చూస్తారు. తాజాగా వాంగ్ గాంగ్ ఆ వంట‌కం త‌యారీని వీడియో తీసి పెట్ట‌డంతో గ‌గ్గోలుమొద‌లైంది. పైగా ఆయ‌న పెట్టింది కూడా ఎనీయింగ్ వ‌ర్ధంతి త‌ర్వాతి రోజే కావ‌డం నెటిజ‌న్ల ఆగ్ర‌హాన్ని మ‌రింత ఎగ‌దోసింది.


ఆఖ‌రికి త‌న త‌ప్పు తెలుసుకున్న వాంగ్‌.. త‌న టీం పొర‌పాటున ఈ వీడియోను అప్‌లోడ్ చేశార‌ని క్ష‌మాప‌ణ‌లు చెప్పుకొని.. ఆ వీడియోను తొల‌గించాడు. అయితే వాంగ్‌ది పొర‌పాటు కాద‌ని ఆయ‌న‌కు ఇది అల‌వాటేన‌ని కొంద‌రు యూజ‌ర్లు కామెంట్ చేశారు. 2020లోనూ ఆయ‌న ఎగ్ ఫ్రైడ్ రైస్ వీడియోను పోస్ట్ చేశాడ‌ని ఆరోపించారు.