Marathon | ఆరోగ్యంగా ఉన్నవారు, మంచి అలవాట్లు, నిత్యం వ్యాయామం చేసేవారు.. మారథాన్‌లలో పాల్గొనేందుకు ముందు వరుసలో ఉంటారు. కానీ ఓ 50 ఏండ్ల వ్యక్తి మాత్రం ఇందుకు విరుద్ధం. అతను నిత్యం సిగరెట్లు కాల్చుతుంటాడు. ప్రతి రోజు వ్యాయామం చేయడు. అయినప్పటికీ మారథాన్‌లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించాడు. అది కూడా సిగరెట్లు కాల్చుతూ ఏకంగా 42 కిలోమీటర్లు మారథాన్ పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. 3 గంటల 28 నిమిషాల్లో పూర్తి చేసిన ఈ మారథాన్‌లో ఆ వ్యక్తి ఒక ప్యాక్ సిగరెట్లను మొత్తం కాల్చేశాడు. ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే చైనా వెళ్లక తప్పదు.
చైనాకు చెందిన అంకుల్ చెన్ అనే వ్యక్తి(50) ఇటీవల నిర్వహించిన 42 కిలోమీటర్ల మారథాన్‌లో పాల్గొని విజయం సాధించాడు. మారథాన్ ప్రారంభించినప్పుడే.. సిగరెట్ ప్యాక్‌ను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు చెన్. అనుకున్నట్టే ఆ సిగరెట్లను కాల్చుతూ.. మారథాన్ పూర్తి చేశాడు. పోటీలో ఉన్న 1500 మందిలో చెన్ 574వ రన్నర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా చెన్‌కు నిర్వాహకులు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. చెన్ ఇలాంటి వింత స్టంట్లు చేయడం ఇదే తొలిసారి కాదు. 2018లో గ్యాంగ్‌జౌ మారథాన్‌లో, 2019లో జియోమెన్ మారథాన్‌లలోనూ సిగరెట్లు కాల్చుతూ పాల్గొన్నాడు.