Site icon vidhaatha

Chukka Gangareddy | 4న హలో బుగ్గారం.. చలో కలెక్టరేట్: చుక్క గంగారెడ్డి

Chukka Gangareddy | విధాత బ్యూరో, కరీంనగర్: బుగ్గారం గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై జగిత్యాల జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 4న ‘హలో బుగ్గారం – చలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉద్యమకారుడు చుక్క గంగారెడ్డి తెలిపారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. ప్రతి పక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు స్వచ్ఛందంగా నిరసనకు మద్దతు తెలియజేస్తూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న ఈ న్యాయ పోరాటాన్ని జిల్లా ఉన్నతాధికారులు రాజకీయ ప్రలోభాలకు లొంగి నీరుగార్చుతున్నారని ఆయన విమర్శించారు. బుగ్గారం జీపీలో కోటికి పైగా నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. అధికారులు మూడు సార్లు జరిపిన నామమాత్రపు విచారణలో సుమారు యాబై లక్షలకు పైగా నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆధారాలు లభించాయన్నారు.

అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నదన్నారు. బాధ్యుల నుండి లక్షలాది రూపాయలు రికవరీ చేసిన అధికారులే… చట్టపరమైన చర్యలు మరిచిపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దుర్వినియోగమైన ప్రతీ పైసా రికవరీ అయి, బాధ్యులందరిపై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టే దాకా న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version