Site icon vidhaatha

Ashok Gehlot | డాక్ట‌ర్ అవ్వాల‌నుకుని ఫెయిల‌య్యా.. రూటు మార్చి సీఎం అయ్యా: రాజ‌స్థాన్ సీఎం గ‌హ్లోత్‌

Ashok Gehlot |

కోటా (Kota) న‌గ‌రానికి కోచింగ్‌కు వ‌చ్చిన విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుండ‌టంపై రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గ‌హ్లోత్ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 20 మంది విద్యార్థులు కోటాలో త‌మ ప్రాణాలు తీసుకున్న విష‌యం తెలిసిందే. పోటీ ప‌రీక్ష‌ల ఒత్తిడి వ‌ల్లే వారు ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ని తెలుస్తోంది.

తాజాగా యువ మ‌హాపంచాయ‌త్ అనే కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన గ‌హ్లోత్ ఆత్మ‌హ‌త్య‌ల‌పై మాట్లాడారు. ఈ ఘ‌ట‌న‌లు తీవ్ర విచార‌క‌ర‌మ‌ని తక్ష‌ణం వీటిపై ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న జీవితంలో జ‌రిగిన విష‌యాల‌ను ప్ర‌స్తావించారు.

నేను చిన్న‌ప్పుడు డాక్ట‌ర్ కావాల‌నుకున్నా.. రాత్రుళ్లు 2, 3 గంట‌ల వ‌ర‌కు చ‌దివేవాడ్ని. కానీ ప‌లుమార్లు ప‌రీక్ష‌ల్లో ఫెయిల‌య్యా. అయినా నేను డీలా ప‌డిపోలేదు. ధైర్యం కోల్పోలేదు. దారి మార్చుకుని సామాజిక కార్య‌క‌ర్త‌న‌య్యా. రాజ‌కీయాల్లోకి వ‌చ్చా.. ఇప్పుడు మీ ముందు ఇలా నిల‌బడ్డా అని ధైర్యం చెప్పారు.

ముఖ్య‌మంత్రిని అవుతా అని కానీ, మూడు సార్లు కేంద్ర‌మంత్రిగా కానీ ప‌నిచేస్తాన‌ని తాను ఎప్పుడూ అనుకోలేద‌న్నారు. పిల్ల‌ల‌ను ప‌రీక్ష‌లు పాస‌వ్వాల‌ని ఒత్తిడి చేయ‌కుండా వారు ఏం చేయ‌గ‌ల‌రో గ‌మ‌నించాల‌ని త‌ల్లిదండ్రుల‌కు ఆయ‌న సూచించారు.

మ‌రోవైపు కోటాలో ఆత్మ‌హ‌త్య‌లు పెరుగుతుండ‌టంపై ఆ జిల్లా అధికారులు దృష్టి సారించారు. ప్ర‌తి కోచింగ్ సెంట‌ర్‌లో చ‌దువుతున్న విద్యార్థుల‌కు ప్ర‌తిరోజు రాత్రి చిన్న చిన్న సైకాల‌జీ ప్ర‌శ్న‌లతో ప‌రీక్ష రాయిస్తున్నారు. వీటిలో ఆత్మ‌హ‌త్య‌ల ఆలోచ‌న‌లు ఉన్న‌వారెవ‌రో విశ్లేషించి కౌన్సెలింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

Exit mobile version