రామగుండం: సింగరేణి తెలంగాణ కొంగు బంగారం, అన్నం పెట్టిన తల్లి. కాబట్టి ఆ సింగరేణిని మరింత విస్తరించుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో రాజీపడం, కార్మికుల శ్రేయస్సు, సింగరేణి బతుకుదెరువు, ముందుకు తీసుకుపోయే పద్దతులను ఆలోచిస్తాం. అది నా హృదయంలో ఉంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రామగుండంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రూ. 600 కోట్ల మారటోరియంలో ఉండి మునగడానికి సిద్ధంగా ఉన్న సింగరేణిని కాపాడి, ఇవాళ రూ. 2,200 కోట్ల లాభాల్లోకి తీసుకునిపోయాం. బ్రహ్మాండంగా కంపెనీ బతికి ఉంది. ఇంకా ఉంటది. ఇంకా కొత్త గనులు వస్తాయి. నేను మీకు శుభవార్త చెప్తున్నా. వాడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కట్టమంటే కట్టలేదు. ముందుకు రాలేదు. మా దగ్గర చాలా మంది సింగరేణి కార్మికులు ఉన్నారు. దాన్ని వాళ్లకు అప్పగిస్తా అని కూడా చెప్పిన.
రాష్ట్రంలో ఉండే ఇతర గనుల్లో మన సింగరేణి కార్మికులు ఎందుకు పోయి పని చేయకూడదు. నేను సింగరేణి ఎండీని ఆస్ట్రేలియా, ఇండోనేషియాకు పంపించాను. చూసిరాపో అక్కడ కూడా రెండు గనులు పట్టుకుందాం.. మనోళ్లు బ్రహ్మాండంగా పని చేస్తారు అని. అంతర్జాతీయంగా బొగ్గు ధరలు క్రాష్ అయ్యాయి. దాంతోని అట్ల ఆపిపెట్టినం. మాట్లాడి వచ్చాం. సందర్భం వస్తే అట్ల కూడా పెరుగుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ రోజు సింగరేణిలో 32 శాతం వాటా ఇస్తున్నాం లాభాల్లో. కాంగ్రెస్ హయాంలో 18, 19 శాతం వాటా ఇచ్చారు. ఈ మధ్యనే దీపావళి బోనస్, లాభాల కోటా కలిపి రూ. 1000 కోట్లు పంపిణీ చేసింది సింగరేణి. ఎన్నడు కూడా చరిత్రలో చేయలేదు ఇంత పెద్ద డబ్బు. రూ. 2 లక్షల దాకా వచ్చాయి ప్రతి కార్మికుడికి. కార్మికుల కోసం ఎన్నో చర్యలు తీసుకున్నాను. నేను ఉద్యమంలో వచ్చినప్పుడు చాలా విషయాలు చెప్పారు.
అవన్నీ మనసులో పెట్టుకుని టీబీజీకేఎస్ నాయకులతో మాట్లాడి చాలా చర్యలు తీసుకున్నాం. మీ హక్కులు చాలా వరకు కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. కార్మికలుకు ఇచ్చే పెర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్యాక్స్ లేకుండా చేయాలని కోరారు. తప్పకుండా వంద శాతం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయిస్తా. ఈ రకంగా అన్ని రకాల మంచి చర్యలు తీసుకుని ముందుకు పోతున్నాం అని కేసీఆర్ తెలిపారు.
ఎన్నో ఏండ్ల నుంచి పరిష్కారం కానీ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. అన్ని వర్గాలను, కులం మతం అనే తేడా లేకుండా కలుపుకొని ముందుకు తీసుకుని పోతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే మీరు మంచి పద్ధతుల్లో ఆలోచన చేసి ఓటేస్తే మంచి జరుగుతది. చందర్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యమకారుడు. ఉద్యమ కాలంలో 74 రోజులు జైల్లో ఉన్నాడు. ఆయన కూడా సింగరేణి కార్మికుడి కుమారుడు.
కాబట్టి సింగరేణి గురించి బాగా అవగాహనం ఉంది. ఇక బొగ్గు, నీళ్లు ఉన్నాయి. రవాణా వసతి ఉంది. ట్రైన్ కూడా ఉంది. మాకు పరిశ్రమలు లేవు అని చందర్ చెప్పారు. రామగుండం నిర్లక్ష్యానికి గురైంది సమైక్య రాష్ట్రంలో. మనం ఇప్పుడు కుదుటపడ్డాం. ఈ ప్రాంతానికి రావాల్సిన పరిశ్రమల గురించి ఆలోచించి తీసుకువస్తాం. దాని కోసం నేను కృషి చేస్తాను అని కేసీఆర్ హామీ ఇచ్చారు.