నేను కొట్లాడేది నా ప‌ద‌వి కోసం కాదు.. సీఎం కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

మూడోసారి జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

  • Publish Date - November 26, 2023 / 10:16 AM IST

జ‌గిత్యాల: మూడోసారి జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను కొట్లాడేది త‌న ప‌ద‌వి కోసం కాదు.. పేద‌రికం లేని తెలంగాణ కోసం అని సీఎం స్ప‌ష్టం చేశారు.


రాష్ట్రం అన్ని రంగాల్లో ముందు వ‌రుస‌లో ఉంది. ఇవాళ‌ చాలా మందికి తెలుస్త‌లేదు. నాకు ఏం కావాలి. నాకు తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశ‌మంత పెద్ద‌ది. దాన్ని మించిన ప‌ద‌వి ఉన్న‌దా..? అయినా మీరు మ‌న్నించి ఇచ్చారు రెండు సార్లు ముఖ్య‌మంత్రిగా అవ‌కాశంఇస్తే ప‌దేండ్లు ప‌ని చేశాను. నా అంత ఎక్కువ కాలం ప‌ని చేసిన తెలుగు ముఖ్య‌మంత్రి ఎవ‌రు లేరు.


ఈ కీర్తీ చాలు నాకు. ఇవాళ నేను కొట్లాడేది నా ప‌ద‌వి కోసం కాదు. క‌చ్చితంగా తెలంగాణ వంద‌కు వంద శాతం పేద‌రికం లేని తెలంగాణ కావాలి అది నా పంతం. కేర‌ళ రాష్ట్రం మాదిరిగా 100 శాతం అక్ష‌రాస్య‌త ఉన్న‌టువంటి రాష్ట్రం కావాలి. రైతాంగం గుండె మీద చేయి వేసుకొని హాయిగా నిద్ర‌పోయి బ్ర‌హ్మాండ‌మైన పంట‌లు పండే తెలంగాణ కావాలి.


తెలంగాణ‌లో ప్ర‌తి ఇంచుకు నీళ్లు రావాలి. దాని కోసం తండ్లాడుతున్నాం త‌ప్ప ఈ ప‌ద‌వి కోసం కాదు. నాకు 70 ఏండ్ల వ‌య‌సు వ‌చ్చింది. ఇంకే కావాలి జీవితంలో. పార్టీల‌ వైఖ‌రి, నాయ‌కుల ఆలోచ‌నాస‌ర‌ళి అన్నీ ఆలోచించి ఓట్లు వేయాలి త‌ప్ప ఆగ‌మై ఓట్లు వేయొద్దు అని కోరుతున్నా.


మంచి ఏ రోజు అయినా మంచి అయిత‌ది.. చెడు ఏ రోజు అయినా చెడు అయిత‌ది.. క‌న్ఫ్యూజ‌న్ కావొద్దు. నేను చెప్పిన విష‌యాల‌ను మీ వ‌ర‌కే ఉంచుకోకుండా బ‌స్తీల్లో, గ్రామాల్లో ప్ర‌జ‌ల మ‌ధ్య‌న చ‌ర్చ‌పెట్టింది. రాబోయే ప్ర‌మాదాన్ని ప‌సిగ‌ట్టండి. త‌ప్ప‌కుండా బీఆర్ఎస్ పార్టీకి ఘ‌న విజ‌యం ఇవ్వండి. అది మ‌నంద‌రికి శ్రేయ‌స్క‌రం అని కేసీఆర్ పేర్కొన్నారు.