చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గానికి ఒకే విడుత‌లో ద‌ళిత‌బంధు.. ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్

చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గం ద‌ళితవాడ‌ల్లోని ద‌రిద్రాన్ని పీకి అవ‌త‌ల ప‌డేసేందుకు ఒకే విడుత‌లో ద‌ళిత‌బంధు మంజూరు చేయించే బాధ్య‌త నాది అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

  • Publish Date - November 27, 2023 / 10:38 AM IST

చేవెళ్ల: చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గం ద‌ళితవాడ‌ల్లోని ద‌రిద్రాన్ని పీకి అవ‌త‌ల ప‌డేసేందుకు ఒకే విడుత‌లో ద‌ళిత‌బంధు మంజూరు చేయించే బాధ్య‌త నాది అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ద‌ళితబంధు ఒకే విడుత‌లో వ‌స్త‌ది కాబ‌ట్టి.. ఒక్క ద‌ళిత ఓటు కూడా వేరే పార్టీకి ప‌డొద్దు అని కేసీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ మాట్లాడారు.


యాద‌య్య నాకు ద‌గ్గ‌రి మ‌నిషి. మీ అంద‌రికీ తెలుసు. ఆయ‌న అడిగిన త‌ర్వాత నేను కాద‌నే ముచ్చ‌ట కాదు. ఇది ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం. ఆయ‌న ద‌ళిత‌బంధు కావాల‌ని అడిగారు. కాలే యాద‌య్య కోరిన‌ట్టు ద‌ళిత‌బంధు మీకు వ‌చ్చేట‌ట్టు చేస్తాను. చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గం ద‌ళిత‌వాడ‌ల్లోని ద‌రిద్రాన్ని పీకి అవ‌త‌ల ప‌డేద్దాం. మీకు అంద‌రికి ఒకే విడుత‌లో ద‌ళిత‌బంధు మంజూరు చేస్తా. దాంతో చాలా బాగుప‌డుతాం. ముందుకు పోగ‌లుగుతాం.


మీరు కోరుతున్న ప‌రిశ్ర‌మ‌లు, మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తాం. ఇంకా కాలుష్య ర‌హిత ప‌రిశ్ర‌మ‌లు కూడా వ‌స్తాయి. చాలా మంది లైన్‌లో ఉన్నారు ప‌రిశ్ర‌మ‌లు పెట్ట‌డానికి. యాద‌య్య చీమ‌కు, దోమ‌కు కూడా న‌ష్టం చేసే మ‌నిషి కాదు. తోచిన కాడికి ప‌ని చేస్త‌డు త‌ప్ప ఏ మ‌నిషికి న‌ష్టం చేయ‌డు. వేరే పార్టీల వ్య‌క్తుల చ‌రిత్ర మీకు తెలుసు. ద‌ళితబంధు ఒకే విడుత‌లో వ‌స్త‌ది కాబ‌ట్టి.. ఒక్క ద‌ళిత ఓటు కూడా వేరే పార్టీకి ప‌డొద్దు అని కేసీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు.


యాద‌య్య నాకు ఓ విచిత్ర‌మైన దోస్తు..


యాద‌య్య నాకు ఓ విచిత్ర‌మైన దోస్తు. నేనేమో అంద‌రికీ ఆర్డ‌ర్ ఇస్తాను. యాద‌య్య నాకు ఆర్డ‌ర్ ఇస్తారు. నా ద‌గ్గ‌రోడు కాబ‌ట్టి.. నేను రాంగానే అడుగుతా ఎమ్మెల్యే సాబ్ ఏం ఆర్డ‌ర్ అని. చేసిన దాకా ఊకోడు. ప‌ట్టుబ‌డుతాడు మొండిగా. ఈసీ వాగు, మూసీ వాగు మీద బ్రిడ్జిలు కావాల‌ని న‌న్ను, ఆ మంత్రులు ఆగ‌మాగం ప‌ట్టించిండు. అవ‌స‌రం ఉన్న‌ది.. జ‌నం పెరిగింది మాకు, గ్రామాల‌కు రాక‌పోక‌లు పెరిగాయి, కంప‌ల్స‌రీ నాకు బ్రిడ్జిలు కావాల‌ని ప‌ట్టుబ‌ట్టిండు. ఆ పంచాయ‌తీ రాజ్, ఆర్ అండ్ బీ మినిస్ట‌ర్స్ అయితే చ‌చ్చే ప‌రిస్థితి అయింది వాళ్ల‌కు. అంత వెంబ‌డి ప‌డి తెచ్చిండు అని కేసీఆర్ తెలిపారు.