అందోల్ : అందోల్ నియోజకవర్గానికి ఒకే విడుతలో దళితబంధు మంజూరు చేయిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో దళితబిడ్డల ఓట్లు బీఆర్ఎస్ పార్టీకే పడాలని కేసీఆర్ కోరారు. అందోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్‌కు మద్దతుగా ప్రసంగించారు.
అందోల్ నియోజకవర్గంలోని దళితబిడ్డలు ఆలోచించాలి. అనేక వేల ఏండ్లుగా దళితజాతి అణిచివేతకు, వివక్షకు గురైన జాతి. వాళ్లు మన సాటి మనషులే కదా..? వాళ్లు కూడా పైకి రావాలి. ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటా వారిని అలానే ఉంచడం ధర్మం కాదు. వాళ్లకు నిజంగానే నిజాయితీ ఉండి, నాడే దళితబంధు లాంటి కార్యక్రమాలు తెచ్చి ఉంటే ఎందుకు ఇవాళ దళితుల్లో దరిద్రం ఉండేది.
సమాజంలో అందరికన్నా పేదవాళ్లు దళితులే కదా..? దళితబిడ్డలకు చెప్తున్నా.. ఒక్క ఓటు కూడా అటు ఇటు వేయండి. క్రాంతి కోరినట్టు ఒకే విడుతలో ఆందోల్‌కు దళితబంధు ఇచ్చే బాధ్యత నాది. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని, ఆందోల్ నియోజకవర్గం యొక్క దళితవాడల్లో నుంచి దరిద్రాన్ని పీకి అవతల పడేద్దాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.
సేవాలాల్ జయంతి రోజున సెలవు..
ఎస్టీ బిడ్డలు 50 ఏండ్లు కొట్లాడారు మా తండాలో మా రాజ్యం కావాలని. 3,500 తండాల్లో ఎస్టీలే రాజ్యం ఏలుతున్నారు. మన జోగిపేటలో 14 మంది ఎస్టీ సర్పంచ్‌లు ఉన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరుపుతున్నాం. సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున తప్పకుండా సెలవు కూడా ఇస్తామని ప్రకటిస్తున్నా అని కేసీఆర్ తెలిపారు.
మనం గెలిచిపోతున్నాం అనే గర్వం పనికి రాదు..
చివరి దశకు ఎన్నికల ప్రచారం వచ్చింది. నేను చెప్పిన విషయాలు మజాక్ విషయాలు కాదు. రైతులు, పేదల యొక్క జీవన్మరణ సమస్యలు. కాంగ్రెస్ రాజ్యంలో బాధలు అనుభవించం. ఇప్పుడు మళ్ల ఆ బాధలు కొని తెచ్చుకోవద్దు. ఇందిరమ్మ రాజ్యం తెస్తరట. యెన్కటికి ఒకని తద్దినానికి పిలిస్తే.. ప్రతిరోజు మీ ఇంట్ల ఇట్లనే జరగాలని దీవెన పెట్టిండంట.. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఎవరికి కావాలి ఇందిరమ్మ రాజ్యం నాకు అర్థం కాదు.
ఆ ముక్కిపోయిన, ములిగిపోయిన, మందిని చావగొట్టిన ఆకలి రాజ్యం కావాల్నా..? బ్రహ్మాండంగా రెండు, మూడు పంటలు పండిచి, మన నీళ్లు, మన గాలి మనకు దక్కి, మన కరెంట్ మనకు దక్కి దర్జాగా బతికేటటువంటి రాజ్యం కావాల్నా..? దయచేసి ఆలోచించండి.. ఆషామాషీగా తీసుకోవద్దు. మనం గెలిచిపోతున్నాం అనే గర్వం పనికిరాదు. ఈ జనసమూహాన్ని చూసిన తర్వాత అందోల్‌లో గులాబీ జెండా ఎగిరిపోయిందని అర్థమవుతుంది. వాళ్లకేమో కదిలించి తెచ్చే జనం.. మీరేమో కదిలి వచ్చిన జనం. అది వాళ్లకు మనకు ఉండే తేడా.. అక్కడ్నే అర్థమవుతుంది గెలుపు అని పేర్కొంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.