వరంగల్ : తెలంగాణ చరిత్ర వైభవానికి, వెయ్యేండ్ల తెలంగాణ చరిత్రకు సాక్షీభూతంగా ఉన్న ఈ వరంగల్ వీరభూమికి తాను శిరసు వంచి నమస్కరిస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక కీలక ఘట్టాలకు వరంగల్ పట్టణమే వేదికగా నిలిచిందని గుర్తు చేశారు. ఉద్యమంలో అతి భారీ బహిరంగ సభ ఈ వరంగల్ నగరంలోనే జరిగిందని, భద్రకాళీమాత ఆశీర్వాదంతో మనం తెలంగాణ సాధించుకున్నమని అన్నారు. అమ్మవారికి కిరీట ధారణ చేసి తాను మొక్కు కూడా చెల్లించుకున్నాను అని కేసీఆర్ తెలిపారు. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు కలిపి ఒకే చోట ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
అన్నింటికన్నా మించి వరంగల్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఏందంటే.. రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం పెట్టడం, చెరువులు బాగు చేసుకునే కార్యక్రమానికి మిషన్ కాకతీయ అని పేరు పెట్టడం. ఇది కాకతీయ రాజులకు తెలంగాణ ప్రజలు అర్పించిన నిజమైన నివాళి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నేను ఉద్యమాన్ని తలకెత్తుకున్న సందర్భంలో నన్ను నిండు మనసుతో ఆశీర్వదించిన ప్రజాకవి కాళోజీ గారిని, నాకు ఆ రోజు అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని నేను మనఃపూర్వకంగా స్మరించుకుంటున్నా.
ఈ సందర్భంగా నేను చెప్పేదేందంటే ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించాలె. మీరు వేసే ఓటు తెలంగాణతోపాటు వరంగల్ ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల ఐదేండ్ల భవిష్యత్తును నిర్ణయిస్తది. కాబట్టి అసుంటి ఓటును ఆషామాషీగా వేయవద్దు. మంచి అభ్యర్థికి, మంచి పార్టీకి వేయాలె. అప్పుడే మంచి జరుగుతది. కాబట్టి మీ గ్రామాలల్లో బాగా చర్చించి, మంచి పార్టీ ఏదో, మంచి అభ్యర్థి ఎవరో తేల్చుకుని ఓటేయాలి అని కేసీఆర్ కోరారు.
కాంగ్రెస్ అసమర్థ పాలనవల్ల వరంగల్ పట్టణంలో తాగు నీళ్లకు కరువు ఏర్పడింది. తెలంగాణ రాకముందు తాగు నీళ్లకు గోస ఉండె. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నయ్. నిజాం కాలంలో పెట్టిన అజాంజాహీ మిల్లును కాంగ్రెస్ పార్టీ అమ్మేసింది. బీఆర్‌ఎస్ వచ్చినంక వరంగల్ దగ్గరలోనే బ్రహ్మాండమైన టెక్స్‌టైల్ పార్కును పెట్టుకున్నం. చాలా పెద్దపెద్ద కంపెనీలు వచ్చినయ్. ఏడాది, రెండేండ్లలో ఆ టెక్స్‌టైల్ పార్కులో లక్షల మంది ఆడవాళ్లు, మగవాళ్లకు ఉద్యోగాలు రాబోతున్నయ్ అని కేసీఆర్ తెలిపారు.