విధాత ప్రత్యేకం: ‘మా ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు అంటున్నారు. అందుకే మేము కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడంలేదు. మా పార్టీలోకి పొద్దునే ఒక గేటు తెరిచా.. మొత్తం ఇంకా తెరవలేదు. ఇవాళ ఒక ఎంపీ, ఎమ్మెల్యేకు గేటు ఓపెన్ చేశాం. అధిష్ఠానం సూచనల మేరకే చేరికలుంటాయి’.. ఇదీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం మీట్ ది మీడియా కార్యక్రమంలో చెప్పిన మాట.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీకి అవసరమైన 60 సీట్లకు అదనంగా నాలుగు మాత్రమే వచ్చాయి. నలుగురు ఐదుగురు అటు ఇటు అయితే ప్రభుత్వ మనుగడ గురించి మీడియా అప్పట్లో ప్రశ్నించింది. అందుకే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఆత్మన్యూనతాభావంలో ఉన్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చనక్కరలేదని, ఆ పార్టీలోనే సీఎం సీటుపై చాలామందికి ఆశలున్నాయి.. వాళ్లే అగ్నికి ఆజ్యం పోస్తారని బీఆరెస్, బీజేపీ చెబుతున్నాయి. ముఖ్యంగా భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి లాంటి వాళ్లు చివరిదాకా సీఎం సీటు కోసం ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కొంతమంది సీనియర్లకు, సీఎంకు మొదటి నుంచీ విభేదాలున్నాయి. ఇప్పుడు బయటకు రాకున్నా అంతర్గతంగా అవి కొనసాగుతూనే ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సీఎంగా ఇప్పటికీ రేవంత్‌రెడ్డికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు లేదు. ఎందుకంటే ఢిల్లీ పర్యటనకు వెళ్లినా, ప్రధాని, కేంద్ర మంత్రులను కలవడానికి వెళ్లినా భట్టి లేదా మరొకరు ఆయన వెంటే ఉంటున్నారు. ఇది అధిష్ఠానం కనుసన్నల్లోనే జరుగుతున్నదని సమాచారం.
బీఆర్‌ఎస్ కంటే బీజేపీ నేతలు ప్రస్తుత ప్రభుత్వ మనుగడపై ఎక్కువగా వ్యాఖ్యానిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్‌రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది. బీజేపీ తాము అధికారంలో లేని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని అనుకుంటే అక్కడి అధికారపక్షమే కాదు, ఇతర విపక్ష పార్టీల్లోనూ చీలిక తెచ్చే ప్రణాళికలను అమలు చేస్తున్నది. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు అంటూ ఏదైనా ఉంటే అది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచే ఉంటుంది తప్ప.. బీఆర్‌ఎస్‌తో కాదు. అలాంటి పరిస్థితి వస్తే బీఆర్‌ఎస్ కూడా బాధిత పార్టీగానే మిగులుతుంది. బీజేపీ తాను ఏదైనా అనుకుంటే దాన్ని అమలుచేయడానికి ఏ సిద్ధాంతాలు, విలువలు పాటించదని గత పదేళ్ల కాలంలో అనుభవంలో ఉన్నదే. బీఆర్‌ఎస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే లోక్‌సభ ఎన్నికల్లో పనిచేయబోతున్నాయని, అందుకే బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీలతో పాటు, మాజీ ఎంపీలను ఆ పార్టీలోకి పంపుతున్నారనే టాక్ కూడా వినిపిస్తున్నది. అది రాష్ట్రంలో అధికారపార్టీని అస్థిరపరచడం వరకే పరిమితమౌతుందా? లేక బీఆర్‌ఎస్ పరిస్థితి కూడా మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీల మాదిరిగా మారుతుందా? అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.
అయితే పిల్లి మెడలో గంట ఎవరు కడుతారు? అనే సామెతలా అనివార్య పరిస్థితుల్లో గేట్లు తెరువాల్సి వచ్చిందని రేవంత్‌రెడ్డి మీట్ ది ప్రెస్‌లో వ్యాఖ్యానించారు. అయితే తర్వాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యులు అవుతారు? గతంలో మీరు చేసిందే ఇప్పుడు మేం చేస్తున్నామంటే బీఆరెస్ ఏం సమాధానం చెబుతుందనేది ఆసక్తికర అంశం. అదే బీజేపీకి కూడా వర్తిస్తుంది.
అయితే ఫిరాయింపులపై మాత్రం ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫిరాయింపులపై వారి అభిప్రాయాన్ని ఓట్ల రూపంలో స్పష్టంగా చెప్పారు. దీన్నిదృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు, నేతలు వ్యవహరించాలి. ఒకప్పుడు తమ ప్రభుత్వాన్నికూల్చడానికి యత్నించారనే కారణాన్ని చూపెడుతూ రాజకీయ పునరేకీరణ పేరుతో విపక్ష పార్టీల ఎమ్మెల్యేను అధికారపార్టీలోకి వచ్చేలా కేసీఆర్ చేశారననే వాదన ఉన్నది. అది 2014తోనే ఆగలేదు, 2018 తర్వాత కూడా కొనసాగింది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫిరాయింపులను ఎలా సమర్థించుకుంటుంది? ప్రజలు ఈ పరిణామాలను హర్షిస్తారా? వ్యతిరేకిస్తారా? అనేది వేచిచూడాలి.