మూడు ఫీట్లు లేడు బీఆరెస్‌ను వంద ఫీట్లలోతున బొంద‌పెడ‌త‌డ‌ట‌!: కేటీఆర్‌

బీఆరెస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని తొక్కేస్తామని గతంలో చాలమంది విమర్శించి ఎన్నికల్లో పోటీలో లేకుండా పోయారని

  • Publish Date - January 28, 2024 / 01:50 PM IST
  • తొక్కేస్తామన్నవారే పోటీలో లేకుండా పోయారు
  • సెక్రటేరియట్‌ కింద లంకె బిందలు ఉండవు
  • మేనేజ్‌మెంట్‌ కోటా సీఎం రేవంత్‌ రెడ్డి
  • అనాలోచిత పథకాలతో అనర్థాలు
  • బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

విధాత, హైద‌రాబాద్ : బీఆరెస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని తొక్కేస్తామని గతంలో చాలమంది విమర్శించి ఎన్నికల్లో పోటీలో లేకుండా పోయారని, మేనేజ్‌మెంట్‌ కోటా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఏమవుతుందంటూ బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గం బీఆరెస్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డిపైన, కాంగ్రెస్‌, బీజేపీలపైన ఘాటైన విమర్శలు చేశారు. కేసీఆర్‌ను తొక్కుతాం..బొంద పెడుతామం..గులాబీ జెండాను కనబడకుండా చేస్తామని గతంలో చాల మంది మాట్లాడారని, మీ గురువులు చంద్రబాబు, వైఎస్‌లు కూడా మాట్లాడారని, పెద్ద పెద్ద తీస్‌మార్‌ ఖాన్ గాళ్లతో కాలేదని, నీలాంటి బుడ్డర్ ఖాన్ గాళ్ళతో ఎం అవుతుందని..నీ అసొంటోళ్లు మస్తుగా వస్తుంటారు పోతుంటారని సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. 3 ఫీట్లు లేడు బీఆరెస్‌ పార్టీని 100 మీటర్ల లోపల బొంద పెడతాడట అని ఎద్దేవా చేశారు. కాలం కలిసొస్తే కాలం క‌లిసి వ‌స్తే వాన‌పాములు కూడా నాగుపాములై బుస‌లు కొడుతాయ‌ని తంతే గారల బుట్టలో పడినట్లు పడ్డావని, ఇవాళ ప్రజలకు తెలుసు.. నీవు ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రి కాదని, ఢిల్లీ ద్వారా మేనేజ్‌మెంట్‌ కోటాలో ఢిల్లీని మేనేజ్‌ చేసుకుని మాణిక్కం ఠాగూర్‌కు 50కోట్లు ఇచ్చి వీరివారి చెవుల్లో ఊది. నలుగురిని పొగేసుకుని ఢిల్లీని మేనేజమెంట్‌ చేసుకుని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరి కలిసి కూడబలుక్కుని నిన్ను సీఎంగా ఎన్నుకోలేదంటూ రేవంత్‌ను విమర్శించారు. రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ కాలు గోరుకి కుడా సరిపోవన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వ‌చ్చేదా..? తెలంగాణ రాకుంటే సీఎం, డిప్యూటీ సీఎం ప‌ద‌వులు మీకు ద‌క్కేవా..? రేవంత్ రెడ్డి అంటూ విమర్శించారు.

 

కాంగ్రెస్‌ హామీలన్ని 420 హామీలే

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన 420హామీలన్ని నిజంగానే మోసపూరిత హామీలని కేటీఆర్‌ విమర్శించారు. అమ‌లు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింద‌ని కేటీఆర్ తెలిపారు. రూ. 2 ల‌క్ష‌ల రైతు రుణ‌మాఫీ చేయ‌లేదు. రైతుబంధు కింద వారం రోజుల్లోనే రూ. 7,500 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఘ‌న‌త కేసీఆర్‌దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది.. కరెంట్ క‌ష్టాలు మొద‌ల‌య్యాయన్నారు. కాంగ్రెస్‌ వస్తే కరెంట్ ఉండదని కేసీఆర్ ముందే చెప్పిండని, అదే నిజమైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేవలం స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమేనని…మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామన్నారు.

తెలంగాణ తెచ్చింది గులాబీ జెండానే అని.. పోయింది అధికారం మాత్ర‌మేగాని.. పోరాట ప‌టిమ కాదన్నారు. ప్ర‌జ‌ల పక్షాన ప్ర‌శ్నించ‌డంలో కేసీఆర్ కంటే ప‌దునైన గొంతు దేశంలో లేదన్నారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను త‌ప్పించుకునేందుకు కాంగ్రెస్‌ పాలకులు రోజుకో అవినీతి క‌థ అల్లుతున్నారని విమర్శించారు. ఇక్క‌డ అవినీతి.. అక్క‌డ అవినీతి అని క‌థ‌లు చెబుతున్నారని, అధికారం మీ చేతుల్లోనే ఉందని, అవినీతిని వెలికితీయ‌మ‌నే చెబుతున్నామన్నారు. అవినీతి జ‌రిగిన‌ట్లు తేలితే బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోండని, ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా త‌ప్పించుకుంటే వ‌దిలిపెట్టం అని కేటీఆర్ హెచ్చ‌రించారు.

సెక్రటేరియట్‌ కింద లంకె బందెలు ఉండవని సీఎం రేవంత్‌ రెడ్డి తెలుసుకోవాలని, సెక్రటేరియట్‌లో అధికారులు, కంప్యూటర్లు మాత్రమే ఉంటాయని ఎద్దేవా చేశారు. అసలు అధికారంలోకి వ‌స్తామ‌ని కాంగ్రెస్ కూడా న‌మ్మ‌లేదని, ఎలాగు వచ్చేది లేదని తెలిసే అడ్డగోలు హామీలిచ్చారన్నారు. డిక్ల‌రేష‌న్ల పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేశారన్నారు. ఇప్పుడు చెప్పిందే నిజ‌మైంద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారన్నారు. ఉచిత బ‌స్సు ప‌థ‌కంతో ఆటో డ్రైవ‌ర్ల బ‌తుకులు ఆగం అయ్యాయని, ఫ్రీ బ‌స్సు ప‌థ‌కంతో బ‌స్సుల్లో యుద్ధాలు జ‌రుగుతున్నాయన్నారు. ఏదైనా ప‌థ‌కం తెస్తే ఆలోచించి తేవాలన్నారు. అనాలోచిత పథకాల అమలు సాధ్యం కాకపోగా మరిన్ని అనర్థాలను సృష్టిస్తున్నాయన్నారు. ప్రభుత్వం తరుపున గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం అంతా అబ‌ద్దాల పురాణమని, శ్వేత‌ప‌త్రం పెడితే.. ధీటుగా జ‌వాబిచ్చామన్నారు. కేసీఆర్ ప్ర‌తిప‌క్షంలో ఉంటేనే ప‌వ‌ర్ ఫుల్ అని, త్వరలో అసెంబ్లీకి, ప్రజల్లోకి వస్తారని కాస్కో రేవంత్‌ రెడ్డి అని కేటీఆర్‌ హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆరెస్‌ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ ములాఖ‌త్ అయ్యాయాని ఆరోపించారు. సిరిసిల్ల నేత‌న్న‌ల‌కు బీఆరెస్‌ అండ‌గా ఉంటుందని కేటీఆర్ భ‌రోసా ఇచ్చారు.