ప్రాజెక్టుల లోపాల పాపాలకు మామా అల్లుళ్లే కారణం

బీఆరెస్ పదేళ్ల పాలనలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల లోపాల పాపాలకు మామ అల్లుళ్లు మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి టీ.హరీశ్‌రావులే కారణమని చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పకుండా నిస్సిగ్గుగా సభలో నిలబడి వాదిస్తూ మమ్మల్ని ప్రశ్నిస్తారా? అని సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు

  • Publish Date - February 17, 2024 / 10:35 AM IST

  • క్షమాపణలు చెప్పకుండా.. ఇంకా వాదిస్తారా?
  • కేసీఆర్ కమిటీనే వద్దని చెప్పింది..అయినా వినకపాయే
  • తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డ మార్చి ముంచేశారు
  • హరీశ్‌రావు విచారణ కమిటీ ముందు తప్పులు ఒప్పుకోవాలి
  • సాగునీటీ రంగం శ్వేతపత్రంలో సీఎం రేవంత్‌రెడ్డి


విధాత, హైదరాబాద్ : బీఆరెస్ పదేళ్ల పాలనలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల లోపాల పాపాలకు మామ అల్లుళ్లు మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి టీ.హరీశ్‌రావులే కారణమని చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పకుండా నిస్సిగ్గుగా సభలో నిలబడి వాదిస్తూ మమ్మల్ని ప్రశ్నిస్తారా? అని సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. సాగునీటి రంగం శ్వేతపత్రంపై అసెంబ్లీలో శనివారం జరిగిన స్వల్పకాలిక చర్చలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఖాజానాను కొల్లగొట్టేందుకే ప్రాజెక్టుల రీడిజైన్లు చేసి రాష్ట్రానికి గుదిబండగా మార్చి దుర్మార్గానికి తెగపడ్డారని దుయ్యబట్టారు. కేసీఆర్, హరీష్ కలిసి రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో వాళ్లు తెలుసుకోవాలని, కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు తెలంగాణకు ఒక కళంకంగా మిగిలిపోయిందన్నారు. వారు కట్టిన ప్రాజెక్టులు పగిలిపోతుంటే క్షమాపణలు చెప్పకుండా.. ఇంకా వాదిస్తారా? అని విమర్శించారు.


తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొండి వాదనలు.. తొండి వాదనలను హరీశ్‌రావు మానుకుని జరిగిన తప్పులకు క్షమాపణలు చెప్పి సహకరిస్తే గౌరవం ఉంటుందన్నారు. సిట్టింగ్ జడ్జి విచారణకు వచ్చినపుడు ఎవరి ఒత్తిడితో ఇలా చేశారో కన్ఫెక్షన్ స్టేట్ మెంట్ ఇచ్చి హరీశ్ రావు తమ తప్పులు ఒప్పుకోవాలన్నారు. ప్రాజెక్టులపై వాస్తవాలను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సభ ముందు పెట్టే ప్రయత్నం చేశారు కానీ వాస్తవాలను తప్పులు తడకా అని చెపుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎవరు మాట్లాడితే వారిపై దాడి చేయడం సరికాదన్నారు.


ఇక తెలంగాణ ఇచ్చిందే మేమే.. తెలంగాణ తెచ్చినోళ్ళు మావాళ్లేననిని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంటులో పెప్పర్స్ బారిన పడ్డది మా ఎంపీలే అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఇక తెలంగాణకు నీళ్లు ఇచ్చిన అపర భగీరధుడు కేసీఆర్ అని చెప్పుకుంటున్నారని, నెమలికే కేసీఆర్ నాట్యం నేర్పినట్లుగా మాట్లాడుతున్నారని, దోచుకోవాలి దాచుకోవాలన్న ఆలోచనతో ప్రాజెక్టుల రీడిజైన్‌ దుర్మార్గానికి ఒడిగట్టారని, సాగునీటి మంత్రిగా కొనసాగిన హరీశ్‌రావును ఆ తర్వాత కేసీఆర్‌ ఎందుకు బర్తరఫ్‌ చేశారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.


కేసీఆర్ వేసిన కమిటీ వద్దన్నా ఎందుకు వినలేదు


సభలో ఏదైనా మాట్లాడితే బీఆరెస్ సభ్యులు గతంలో అని మాట్లాడుతున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన విషయాలను మీకు గుర్తు చేస్తున్నానని, ప్రాణహిత చేవెళ్లకు అడ్డంకులను తొలగించేందుకు మహారాష్ట్ర సీఎంతో, ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ఏపీ సీఎం చర్చించారన్నారు. 2012 లో స్టాండింగ్, కో-ఆర్డినేషన్ కమిటీలను వేశారన్నారు. ఆనాడు ప్రాణహిత వల్ల మహారాష్ట్రలో ముంపుకు గురయ్యేది 1850 ఎకరాల పట్టా భూములు మాత్రమేనన్నారు. గోదావరి ప్రాజెక్టులపై రిటైర్డ్ ఇంజనీర్లతో ఆనాటి సీఎం కేసీఆర్, ఆనాటి మంత్రి హరీష్ రావు ఒక కమిటీ వేశారని తెలిపారు. ఐదుగురు సభ్యుల కమిటీ 14పేజీల నివేదిక ఇచ్చిందన్నారు. మేడిగడ్డ వద్ద నిర్మిస్తే నిరుపయోగమని ఐదుగురు ఇంజనీర్ల కమిటీ తేల్చేసింది.


తుమ్మిడిహెట్టి దగ్గరే ప్రాజెక్టు నిర్మించాలని వారు నియమించిన ఇంజనీర్ల కమిటీ స్పష్టం చేసిందన్నారు. ఈ నివేదికను తొక్కిపెట్టి మామా అల్ల్లుళ్లు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించారన్నారు. ఇదే విషయాన్ని తొమ్మిదేళ్ల క్రితం మేడిగడ్డ మేడిపండేనా అని కేసీఆర్‌ మిత్రుడి పత్రిక సాక్షిలో రాశారన్నారు. మీరు నియమించిన అధికారుల నివేదికనే మీరు తప్పు పడతారా? అని ప్రశ్నించారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని పుర్రెలో పురుగు పుట్టిందే కేసీఆర్‌కు అని అన్నారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ కు ఏ దేవుడు కలలోకి వచ్చి చెప్పారో తెలియదు…ఆయనే ఇంజనీర్లకు సలహా ఇచ్చారన్నారు.


తుమ్మిడి హట్టి వద్ద కేలం 38వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1.47లక్షల కోట్లకు పెంచి కాళేశ్వరం మేడిగడ్డ నిర్మించారన్నారు. చేవెళ్లలో అప్పటికే చేపట్టి 10వేల కోట్ల మేరకు ఖర్చు పెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఆపితే ఆనాడు ధర్నా చేసిన మా అక్క సబితమ్మ ఇప్పుడు వారి పక్కనే ఉందని, ఆనాడు దీక్షలు, ధర్నాలు చేసిన సబితక్క.. ఇప్పుడు హరీష్ రావుని సమర్ధిస్తున్నారా? అని ప్రశ్నించారు. అక్క బాధ్యత ఏంటని.. తమ్ముళ్లు తప్పు చేస్తే సరిదిద్దాలని చెప్పుకొచ్చారు. ఎండిపోయినా అక్కకు ఏం కనబడటంలేదని వాళ్ల బడే అది.. అక్కడ చేరగానే సిలబస్ మారుతుందని, కడియం శ్రీహరి కూడా మంచోడు.. అక్కడ పోయి ఆయన కూడా అలాగే తయారయ్యాడని రేవంత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Latest News