Site icon vidhaatha

CM Revanth Reddy | ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు తెచ్చిన గొప్ప వ్య‌క్తి పీవీ


CM Revanth Reddy | విధాత‌: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం ప‌ట్ల సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభలో హర్షం వ్యక్తం చేశారు. ఆర్ధిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప వ్యక్తి పీవీ అని అన్నారు. పీవీ నరసింహారావు కు భారత రత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామ‌న్నారు. ఆలస్యమైనా వారికి ఈ గౌరవం దక్కడం గర్వకారణమ‌న్నారు. పీవీకి నా తరపున, సభ తరపున, తెలంగాణ ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాన‌న్నారు. పీవీకి భార‌త ర‌త్న ప్ర‌క‌టించ‌డం మనందరికీ గర్వకారణమ‌ని సీఎం రేవంత్ అన్నారు.



ప్ర‌పంచంలోనే బ‌ల‌మైన భార‌త్‌గా మార్చిన పీవీ


కుప్పకూల బోతున్న భారత ఆర్థిక వ్యవస్థను తన ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ ద్వారా ప్రపంచంలోనే ఆర్థికంగా బలమైన దేశంగా భారత్ ను రూపొందించడంలో స్వర్గీయ పీవీ నరసింహారావు తన చివరి శ్వాస వరకు శ్రమించారని డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.. ఆయన వేసిన ఆర్థిక సంస్కరణల పునాదుల ఫలంగానే నేడు భారతదేశం ప్రపంచంలోనే ఆర్థికంగా నాలుగవ బలవంతమైన దేశంగా రూపుదిద్దుకుందన్నారు.


గొప్ప రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వర్గీయ పీవీ నరసింహారావుకు భారతరత్న దక్కడం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా భావిస్తున్నామ‌న్నారు. మా పోరాటాన్ని ప్రయత్నాన్ని సుదీర్ఘకాలం తర్వాత గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.


ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన ఈదేశ వాసుల ఆకలి తీర్చేందుకు తన జీవితాంతం కృషచేసిన ఎంఎస్‌స్వామినాథన్ కు భారతరత్న దక్కడం హర్షణీయమ‌న్నారు. దేశంలో వరి, గోధుమ పంటల సాగులో అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేసి హరిత విప్లవాన్ని సాధించిన వ్యవసాయ శాస్త్రవేత్త లందరికీ ఆదర్శనీయుడు స్వామినాథన్ అని తెలిపారు.


రైతు సమస్యలపై ఈ దేశంలో మొదటిసారి గళం విప్పి పోరాడి రైతుల విజేతగా నిలిచిన మాజీ ప్రధాని చరణ్ సింగ్ భారతరత్న దక్కడం శుభపరిణామమ‌న్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఈదేశానికి చరణ్ సింగ్ గణనీయమైన సేవలు అందించారన్నారు. ఆయనకు భారతరత్న దక్కడం విలువలుగల, రైతు పక్షపాతిగా పోరాడే నాయకులకు స్ఫూర్తినిస్తుందన్నారు.


మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపిన ఈట‌ల‌


భారత ఆర్థికసంస్కరణల సృష్టికర్త, మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ హర్షం వ్య‌క్తం చేశారు. పీవీకి భారతరత్న ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీ కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

Exit mobile version