విధాత : ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీల అమలులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి శనివారం రెండు గ్యారంటీలు మహాలక్ష్మి ఉచిత బస్ ప్రయాణం, 10లక్షల ఆరోగ్య స్కీమ్‌లను ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలోనే ఈ రెండు స్కీమ్‌లకు రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ అధినేత్రి, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ జన్మదినం పురస్కరించుకుని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలల్లో ఈ రోజు రెండింటి అమలు ప్రారంభించినట్లుగా రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
సోనియమ్మ పుట్టిన రోజు తెలంగాణకు పండుగ రోజు అని అభివర్ణించారు. 2009, డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుందని, నాది తెలంగాణ అని చెప్పుకునే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారన్నారు. ఇవాళ ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందన్నారు.
మహాలక్ష్మి ఉచిత బస్ ప్రయాణ స్కీమ్ ద్వారా ఆడపిల్లలు, మహిళలందరు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్‌లలో, నగరాల్లో సిటీ ఆర్డీనరీ, సిటీ మెట్రో బస్‌లలో ఈ స్కీమ్ అమలు కానుందన్నారు. ఈ స్కీమ్ ద్వారా 40లక్షలకు పైగా మహిళా ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అలాగే రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంతో 10లక్షల వరకు ఉచిత కార్పోరేట్ వైద్యం పేదలు పొందవచ్చని రేవంత రెడ్డి తెలిపారు.
అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేశామని, 100రోజుల్లో మిగతా గ్యారంటీలను అమలు చేసి ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్నారు. తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తామన్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి ఆర్టీసీ బస్‌లో ట్యాంకుబండ్ అంబేద్కర్ విగ్రహం వరకు మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, సీఎస్ శాంతికుమారి, ఆర్టీసీ ఎండి సజ్జనార్ తదితరులు ఉన్నారు.