Electric Bikes
సంక్రాంతిని ఒడిసిపట్టడానికి సంస్థల ప్రణాళిక
విధాత: మార్కెట్‌లో విద్యుత్ కార్లకు ఉన్న క్రేజ్ విద్యుత్ బైక్ (Electric Bikes) లకు లేదన్న విషయం తెలిసిందే. ఛార్జింగ్ పాయింట్ల కొరత, పెట్రోల్ వాహనాలపై ఉన్న మోజు వినియోగదారులను ఎలక్ట్రిక్ బైక్‌ల వైపు రాకుండా అడ్డుకుంటోంది. అయితే నూతన మోడళ్లను తీసుకురావడం ద్వారా వారి దృష్టిని ఆకర్షించాలని బడా కంపెనీలు పోటీ పడుతున్నాయి. రానున్న 10 నెలల్లో సుమారు 20 మోడళ్లు భారత మార్కెట్లోకి రానున్నాయి.
కాగా.. వాటిలో టీవీఎస్ క్రియాన్, కైనెటిక్ ఈ లూనా, హోండా ఏక్టివా, సుజుకీ బర్గ్‌మన్, వెస్పా ఎలట్రికా, ఎల్ఎంఎల్ స్టార్, హ్యార్లీ డేవిడ్ సన్ లైవ్ వైర్, హీరో ఎలక్ట్రిక్ ఏఈ 47ఈ మొదలైన దుమ్మురేపే బైక్‌లు ఉన్నాయి.
ఇవే కాకుండా జీరో ఎస్ ఆర్ ఎఫ్, స్విచ్ సీఎస్ఆర్ 762, లైగర్ ఎక్స్, గొగొరో 2 సిరీస్ మొదలైన స్టార్టప్ కంపెనీల బైక్‌లూ పోటీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయి. ఈ ఏడాది మే లో ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాలు రికార్డు సృష్టించి లక్ష యూనిట్ల మార్కును అందుకున్నాయి.
అయితే తర్వాతి నెల జూన్‌లో ఈ సంఖ్య 46 వేలకు పడిపోయింది. అయితే ఈ తరుగుదల సాధారణమే నని ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 7,50,000 నుంచి 8,00,000 యూనిట్ల ఈ – బైక్‌లు అమ్ముడయ్యే అవకాశముందని మార్కెట్ నిపుణుడు ఒకరు తెలిపారు.
వచ్చే సంక్రాంతికల్లా నూతన మోడళ్లను తీసుకొచ్చి ఆర్థిక సంవత్సరాన్ని బలంగా ముగించాలని ప్రతి సంస్థ భావిస్తుండటంతో పెద్ద సంఖ్యలో కొత్త మోడళ్లు కనపడతాయని వెల్లడించారు. అయితే అమ్ముడవుతున్న ఈ బైక్‌లలో 80 శాతం మార్కెట్‌లో తొలి 10 స్థానాల్లో ఉన్న సంస్థలవే కావడం గమనార్హం.
ఇందులో బజాజ్, టీవీఎస్ లాంటి సంప్రదాయ సంస్థలతో పాటు ఓలా ఎలక్ట్రిక్ లాంటి కొత్త బడా సంస్థలూ ఉన్నాయి. ఈ పోటీని తట్టుకుని అంకుర సంస్థలు ఏ మేరకు రాణిస్తాయో చూడాల్సి ఉంది. అయితే ఈ – బైక్‌లపై ప్రభుత్వం సబ్సిడీ తొలగించడంతో తప్పని సరిగా ధరలు పెంచాల్సి వచ్చింది.
ఇది చిన్న సంస్థలకు ప్రతికూలంగా పరిణమించింది. అందుకే ఇప్పటికే ఉన్న ప్రీమియం మోడళ్లను కాస్త సవరించి లో యండ్ వేరియంట్లను ప్రవేశపెట్టాలని తయారీ సంస్థలు భావిస్తున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల కొనుగోళ్లలో మహారాష్ట్ర తొలిస్థానంలో నిలించింది.