Complaint against Venkat Reddy to Congress High Command
విధాత: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనను తన కుమారుడిని చంపుతాను అంటూ బెదిరించిన ఆడియో వ్యవహారంపై కాంగ్రెస్ హై కమాండ్(Congress High Command)కు ఫిర్యాదు చేసినట్లు పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ తెలిపారు ఆదివారం సాయంత్రం ఆయన వెంకట్ రెడ్డి బెదిరింపులపై మీడియాతో స్పందించారు.
వెంకటరెడ్డి అసభ్య పదజాలం ఉపయోగించి నా కొడుకుకు ఫోన్ చేసి నన్ను తిట్టడం నాకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. తాను పిసీసీ ఉపాధ్యక్షుడిగా, వెంకట్ రెడ్డి పార్టీ స్టార్ క్యాంపెనర్‌గా ఒకే పార్టీలో పని చేస్తున్నామన్న విషయం మరిచి అసభ్యంగా బెదిరింపులతో కూడిన ఆ భాష ఏమిటో అర్థం కావట్లేదన్నారు. ఆయనకు మతి ఉండి మాట్లాడుతుండో మతి లేక మాట్లాడుతుండో అర్థం కావట్లేదని, దీనిని నేను సీరియస్‌గా తీసుకుంటానన్నారు.
తాను వ్యక్తిగతంగా ఎవరిని కామెంట్ చేయలేదన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసభ్య పదజాలంతో తనను తిట్టిన ఆడియో టేపును తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావుఠాక్రేకు, పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఫార్వర్డ్ చేశానని, మల్లిఖార్జున్ ఖర్గే దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు. ఇలాంటి వాళ్ల పెత్తనం పార్టీలో ఎన్ని రోజులు కొనసాగుతుందో అనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
వెంకట్‌రెడ్డి నన్ను అసభ్య పదజాలంతో తిట్టిన ఆడియో తెలంగాణ రాజకీయాలలో తీవ్రమైన అంతర్మథనానికి, చర్చకు దారితీస్తుందన్నారు.
నేను, రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సందర్భాలలో కాంగ్రెస్ పార్టీని పరిరక్షించుకుంటానికి మాట్లాడుకున్నామన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని వ్యక్తిగతంగా తిట్టిన సందర్భాలు లేవన్నారు. ఆయనపై నేను వ్యక్తిగతంగా ఏమైనా వ్యాఖ్యలు చేస్తే 100% నేను మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో పెట్టే స్వేచ్ఛ ఆయనకు ఉందన్నారు.
నయీమ్ లాంటి కరుడుగట్టిన తీవ్రవాదే నన్ను ఏమి చేయలేక పోయిండని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏం చేస్తాడన్నారు. వెంకట్‌రెడ్డి తనపై చేసిన అసభ్య వ్యాఖ్యలపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దృష్టిలో, తెలంగాణ ప్రజల దృష్టిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డక్ ఔట్ అయిన బ్యాట్స్ మెన్ వికెట్ వంటి వాడన్నారు. వెంకట్‌రెడ్డిని అద్దంకి దయాకర్ విమర్శించిన సందర్భంలో క్షమాపణ చెప్పాలని అడిగారని, మరి ఇప్పుడు వెంకట్‌రెడ్డి తనపై చేసిన విమర్శల విషయంలో పార్టీ ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం వెంకట్‌రెడ్డి తనపై అలాంటి హెచ్చరికల వ్యాఖ్యలు చేశారో తేలాల్సి ఉందన్నారు.