Nalgonda | థాక్రేకు కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డిపై చెరుకు సుధాకర్ ఫిర్యాదు..!

Nalgonda చర్యలు తీసుకోకపోవడంపై నిలదీత.!! విధాత: కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తరచూ సొంత పార్టీకి, నేతలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తున్న పార్టీ స్టార్ క్యాంపైనర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఆదివారం ఏఐసిసి సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్‌రావు థాక్రేకు మరోసారి ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా చందన పల్లి వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు థాక్రే హాజరైన సందర్భంగా చెరుకు […]

  • Publish Date - June 18, 2023 / 01:56 PM IST

Nalgonda

  • చర్యలు తీసుకోకపోవడంపై నిలదీత.!!

విధాత: కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తరచూ సొంత పార్టీకి, నేతలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తున్న పార్టీ స్టార్ క్యాంపైనర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఆదివారం ఏఐసిసి సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్‌రావు థాక్రేకు మరోసారి ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా చందన పల్లి వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు థాక్రే హాజరైన సందర్భంగా చెరుకు సుధాకర్ ఆయనతో భేటీయై వెంకట్ రెడ్డి పై ఫిర్యాదు చేస్తూ లేఖను అందించారు. లేఖలో సుధాకర్ పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.

తాను ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌దేశ్ రాష్ట్ర ఉపాధ్య‌క్షులుగా ఉన్నాను. ఉమ్మ‌డి రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, ప్ర‌జా ఉద్య‌మాల్లో, తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో 3 ద‌శాబ్ధాలు పైగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర స‌మితిలో పొలిట్‌బ్యూరో స‌భ్యుడిగా ఉండి, 2014 త‌రువాత తెలంగాణ ఉద్య‌మ వేదికగా ప‌నిచేసి, 2017లో తెలంగాణ ఇంటి పార్టీగా ఉండి, 2022 ఆగ‌స్టు 5న అఖిల భార‌త కాంగ్రెస్ అధ్య‌క్షులైన మ‌ల్లిఖార్జున ఖార్గే స‌మ‌క్షంలో కాంగ్రెస్ అధ్య‌క్షులు రేవంత్ రెడ్డి గారి చొరువ‌తో కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ హాల్‌లో కాంగ్రెస్‌లో చేరాను.

ఢిల్లీ నుండి నేరుగా రేవంత్‌రెడ్డితో క‌లిసి మునుగోడు ఉప ఎన్నిక‌ల్లోని ప్ర‌చార స‌భ‌కు చండూర్‌లో హాజ‌రై మాట్లాడాను. అదే నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ఎన్నిక‌ల స‌మ‌న్వ‌యంలో మ‌ర్రిగూడ మండ‌లంలో ఉండి అన్ని ప్రాంతాల ప్ర‌చారంలో పాల్గొన్నాను.

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ఉద్దేశపూర్వ‌క రాజీనామా వెనుక కుట్ర‌ను, కాంగ్రెస్‌ను బ‌ల‌హీనప‌రిచే కుయుక్తుల‌ను వ్య‌తిరేకిస్తూ, బ‌హిరంగంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, కొంత ప‌రోక్షంగా బిజెపి అభ్య‌ర్ధిని స‌మ‌ర్ధించ‌డంతో తాను వ్య‌తిరేకిస్తూ కాంగ్రెస్ అభ్య‌ర్ది కోసం ప‌ని చేసిన‌ది వాస్త‌వం. నా చేరిక‌ను వ్య‌తిరేకిస్తూ నన్ను, రాష్ట్ర అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిని జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖర్గేని, ఇన్‌చార్జి మాణిక్యం ఠాకూర్ ని నిందిస్తూ భువ‌న‌గిరి పార్ల‌మెంట్ స‌భ్యుడు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మాట్లాడిన తీరు పార్టీకి తీవ్ర న‌ష్టం క‌లిగించిన‌ది.

మార్చి 3వ తేది, 2023న కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, నా కుమారుడు డా.చెరుకు సుహాస్‌, న‌వ్య హాస్పిట‌ల్‌కు న‌ల్ల‌గొండకు ఫోన్ చేసి అత్యంత జుగుప్సాక‌రంగా తిట్ట‌డం, చంపుతామ‌ని బెదిరించ‌డంతో అన్ని తెలంగాణలోని తెలుగు ప‌త్రిక‌ల్లో, మీడియాలో ప‌తాకా శీర్ష‌క‌ల్లో రావ‌డం, విప‌రీత‌మైన చ‌ర్చ‌కు, న‌ష్టానికి దారి తీసింది.

2023, మార్చి 6న మీకు జ‌రిగిన ప‌రిణామాలు, తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌కై నేను ఇత‌ర టి.పి.సి.సి స‌భ్యుల‌తో ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన సంఘ‌ట‌న‌పై క‌నీస చ‌ర్చ కూడా జ‌ర‌గ‌క‌పోవ‌డం పార్టీ ప్ర‌తిష్ట‌కు న‌ష్ట‌మ‌నే భావిస్తున్నాను.

ఉద‌య్‌పూర్ కాంగ్రెస్ మేధోమ‌ద‌నం త‌రువాత‌, రాయ్‌పూర్ స‌భ‌ల త‌రువాత సామాజిక న్యాయం, ఇంకా ఇత‌ర విష‌యాల్లో గుణాత్మ‌క‌, ఆచ‌ర‌ణాత్మ‌క మార్పును తెలంగాణ ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. దేశానికి కాంగ్రెస్ అవ‌స‌ర‌మ‌ని, యావ‌త్ పౌర స‌మాజం కూడా సానుకూలంగా స్పందిస్తున్న స‌మ‌యంలో బుజ్జ‌గింత‌లు కాకుండా నిర్ధిష్ట క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు కోమ‌టిరెడ్డి లాంటి నేత‌ల‌పై తీసుకోక‌పోతే రాబోయే రోజుల్లో సానుకూల ఎన్నిక‌ల ఫ‌లితాలు రావ‌డానికి ఆటంకం క‌లుగుతుంద‌ని గుర్తుచేస్తున్నాం.

ప్రియాంక గాంధీ యువ‌కుల‌కు సంబంధించి ఒక డిక్ల‌రేష‌న్‌ను ఈ మ‌ద్య ప్ర‌క‌టించ‌డంతో పాటు తెలంగాణ ఉద్య‌మ‌కారుల కోసం ఒక భ‌రోస‌, బాధ్య‌త త‌మ‌ద‌ని మాట్లాడారు. న‌ల్ల‌గొండ‌లో నిరుద్యోగ భ‌రోస కోసం జ‌రిగిన కాంగ్రెస్ స‌భ‌లో యువ‌త‌ను కూడ‌గ‌ట్టి క్షేత్ర‌స్థాయిలో పనిచేసిన న‌న్ను, ఇంకా దుబ్బాక న‌ర్సంహా రెడ్డి, కొండేటి మ‌ల్ల‌య్య‌, చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి, కైలాష్ నేత‌ను వేదిక మీద పిలువ వ‌ద్ద‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఒత్తిడి చేసి అవ‌మానానికి గురి చేశారు.

తెలంగాణ ఉద్య‌మ‌కారుల కోసం జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల కోసం ఒక క‌మిటీని ప్ర‌క‌టించి, దానికి చైర్మ‌న్‌గా నేను ఉండాల‌ని రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే, క‌మిటీ స‌భ్యుల‌తో విడుద‌ల‌కు సిద్ధమైన ప్ర‌క‌ట‌న‌ను ఆపు చేయించి చిన్నారెడ్డిని వెంట‌నే ప్ర‌క‌టించారు. ఈ ర‌క‌మైనా అడ్డంకులు పార్టీ ఇమేజ్‌ను దెబ్బ‌తీస్తుంద‌ని గ‌మ‌నించాలి.

సిఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఆదిలాబాద్ నుండి న‌ల్ల‌గొండ‌కు వ‌చ్చిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌లో మంచిర్యాల‌, వ‌రంగ‌ల్‌, భువ‌న‌గిరి, దేవ‌ర‌కొండ‌, జి.చెన్నారంలో పాల్గొని తేది 17న న‌ల్లగొండ క్లాక్ ట‌వ‌ర్‌కు చేరుకున్నారు. అక్కడ జ‌రిగిన కార్న‌ర్ మీటింగ్‌లో ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కులు ఎవ‌రు ఉన్నా వేదిక ఖాళీ చేయాల‌ని స్థానిక నాయ‌కుల‌చే అనిపించి, కోమ‌టిరెడ్డి అనుచ‌రులే వేదిక‌పై ఉండాలి, ఇత‌రులు దిగాల‌ని హెచ్చ‌రించ‌డం ఒక బ‌హుజ‌న, తెలంగాణ ఉద్య‌మనాయ‌కుడికి జ‌రిగిన అవ‌మాన‌మే కాదు, భ‌విష్య‌త్తులో రాహుల్ గాంధీ నిత్యం చెబుతున్న సోష‌ల్ ఇంజ‌నీరింగ్ తెలంగాణ‌లో, న‌ల్ల‌గొండ‌లో అమ‌ల‌వుతుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేస్తున్న‌ది.

అంతేకాక, ఎవ‌రు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప‌రిమిత‌మైన నాయ‌కులో, ఏ ప్ర‌కారం ప్ర‌స్తుత భువ‌న‌గిరి యం.పి న‌ల్ల‌గొండ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుడ‌వుతారో చెప్పాలి. ఆయ‌న న‌కిరేక‌ల్ నియోజ‌క‌వ‌ర్గం అయితే నేను కూడా అదే నియోజ‌క‌వ‌ర్గం అవుతాను. లేదంటే టి.పి.సి.సి స‌భ్యులు అన్ని నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు అవుతారు.

నిన్న జ‌రిగిన ప‌రిణామాలు అంత‌కు ముందు నిరుద్యోగ భ‌రోసాలో అవ‌మానాలు, కాంగ్రెస్‌లో మా అంద‌రిని ఆత్మ‌గౌర‌వాన్ని కించ‌ప‌రుస్తున్న‌ది. రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల‌పై మీరు రాష్ట్ర ఇన్‌చార్జిగా చ‌ర్చించ‌వ‌ల‌సి ఉన్న‌ది. ద‌ళితున్ని ముఖ్య‌మంత్రి చేయ‌గ‌లిగే పీపుల్స్‌మార్చ్‌లో భ‌ట్టితో స‌హా అంద‌రి మౌనం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు రావాల్సిన మైలేజీకి అడ్డంకి కాకూడ‌ద‌ని మీ దృష్టికి తీసుకు వ‌స్తున్నాను.

వంద కార్ల‌లో వ‌చ్చి చెరుకు సుధాక‌ర్‌ను చంపుతామ‌ని బెదిరించే స్టార్ క్యాంపెయిన‌ర్ పార్టీకి భారం కావొద్ద‌ని, న‌కిరేక‌ల్‌లో, ఇత‌ర ప్రాంతాల్లో అదే ప‌ద్ద‌తి కొన‌సాగిస్తే ఎవ‌రి ఉనికికై వారు ప్ర‌తిచ‌ర్య చేప‌డితే పార్టీకి న‌ష్ట‌మ‌ని గుర్తు చేస్తూ, మీ స్పంద‌న‌కై ఎదురు చూస్తున్నామని చెరుకు సుధాక‌ర్ లేఖలో పేర్కొన్నారు.

Latest News