- ఉద్దేశ పూర్వకంగా బ్లాక్ లిస్ట్‌లో ఉన్న ఐఆర్‌బీకి కట్టబెట్టారు
- విచారణ చేయాలని ఈడీని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేత బక్క జడ్సన్
విధాత: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జాతీయ కాంగ్రెస్ నేత, సోషల్ మీడియా యాక్టివిస్ట్ బక్క జడ్సన్ (Bakka Judson) డిమాండ్ చేశారు.
ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. టోల్ టెండర్ అవకతవకలపై విచారణ చేసి ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్నారు.
ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా ముంబై సంస్థ ఐఆర్‌బీకి (IRB) కి టెండర్ కట్టబెట్టారన్నారు. ఈ ఐఆర్‌బీ సంస్థపైన అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. ఐఆర్‌బీ సంస్థ ఇప్పటికే పలు చోట్ల బ్లాక్ లిస్ట్ లో ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు కాళేశ్వరం, మిషన్ భగీరథ, ధరణిలతో దోచుకున్నారని, తాజాగా ఓ ఆర్‌ఆర్ టోల్ టెండర్‌తో దోచుకుంటున్నారని ఆరోపించారు.
ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయన్నారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ చేయాలని ఈడీని జడ్సన్ డిమాండ్ చేశారు. తెలంగాణను దేశంలో దిగంబరత్వంగా నిలబెట్టారని ఆయన ఆరోపించారు. తెలంగాణను ఏవిధంగా చేశారో చూడండి అంటూ తన వంటిపై ఉన్న బనీయన్‌ను చింపి తెలంగాణ ఈ విధంగా ఉందంటూ చూపించారు.
తెలంగాణను ఆర్థికంగా దిగంబరాత్వానికి కేసీఆర్ తెచ్చారని ఈడీ కార్యాలయం ముందు బట్టలు చింపుకున్నామని బక్క జడ్సన్ తెలిపారు. ఒ ఆర్ ఆర్ టోల్ టెండర్ వల్ల తెలంగాణ సర్కారు ఖజానాకు రూ.15 వేల కోట్లకు పైనే నష్టం వాటిల్లిందన్నారు.
మహారాష్ట్రలో 1,014 లేన్ కి.మీటర్ల రహదారికి 10 ఏండ్ల కాలానికి లీజు రూ.8,875 కోట్లు కాగా తెలంగాణలో 1,264 లేన్ కి.మీటర్ల రహదారికి 30 ఏండ్ల కాలానికి కేవలం రూ.7,380 కోట్లకు మాత్రమే ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని, ఇందులో భారీ అవినీతి జరిగిందని దీనిపై విచారణ చేయాలని ఈడీ కి ఫిర్యాదు చేశానన్నారు.
ప్రస్తుతం వస్తున్న ఆదాయంలో సగానికి సగం తగ్గుతున్నా ఒప్పందం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయన్నారు. మహారాష్ట్రలో తక్కువ దూరం, తక్కువ కాలానికి ఎక్కువ మొత్తం చెల్లించి లీజ్ దక్కించుకున్న ఐఆర్బీ కంపెనీకి.. మన ఓఆర్ఆర్ ఎక్కువ దూరం ఉన్నా, ఎక్కువ కాలానికి.. తక్కువ మొత్తానికే రాష్ట్ర సర్కారు అప్పగించేసిందన్నారు.
టెండర్ల విషయంలోనూ గోప్యతను పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ) అగ్రిమెంట్లో పేర్కొన్న అంశాలేవి? కేవలం టోల్ మాత్రమేనా? జంక్షన్ల వద్ద ఉన్న ఓ ఆర్ ఆర్ భూములు కూడ అప్పగించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
ఇంత తక్కువకు ఓఆర్ఆర్ను కట్టబెట్టడంపై ప్రభుత్వ పెద్దలు మౌనం వీడటం లేదన్నారు. ఆదాయం కోసమే టీఓటీకి ఇస్తే, ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా టెండర్ అగ్రిమెంట్ ఎలా చేసుకుంటారనే ప్రశ్నలకు సర్కార్ నుంచి సమాధానం రావడం లేదని, వెంటనే టెండర్ను వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి గిరిబాబు కుడా పాల్గొన్నారు.