విధాత: నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి కామినేని మెడికల్ కళాశాల ముందు వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శుక్రవారం ఆందోళనకు దిగారు. మెడికల్ ఫైనల్ ఇయర్‌కు సంబంధించిన 200 మంది విద్యార్థుల్లో 150 మందికి ఫీజు తీసుకోకుండా, పరీక్షలకు అర్హత లేకుండా ప్రిన్సిపాల్ చేశారని ఆరోపిస్తూ విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ధర్నా నిర్వహించారు.
విద్యార్థులకు సరైన అటెండెన్స్ లేని కారణం చూపుతూ వారి ఫీజులు తీసుకోకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్లో తల్లిదండ్రులతో, విద్యార్థులతో కలిపి నిర్వహించిన కౌన్సిలింగ్ పిదప అటెండెన్స్ ని పరిగణలోకి తీసుకుంటే 70 నుండి 80శాతం అటెండెన్స్ నమోదు అవుతుందని అలాంటప్పుడు తమ ఫీజు తీసుకోకుండా మొత్తం నాలుగు పరీక్షలు రాయకుండా చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు.
అలాగే తమ సమస్యను విన్నవించేందుకు తల్లిదండ్రులకు విద్యార్థులకు లోనికి అనుమతి చెప్పడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు . విద్యార్థుల ఆందోళనకు స్పందించిన కళాశాల నిర్వాహకులు వారితో చర్చిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.