ముగిసిన సీఎల్పీ స‌మావేశం

తెలంగాణలో ప్ర‌భుత్వం ఏర్పాటులో భాగంగా సోమ‌వారం ఉద‌యం గ‌చ్చిబౌలిలోని హోట‌ల్ ఎల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన సీఎల్పీ స‌మావేశం ముగిసింది.

  • Publish Date - December 4, 2023 / 09:08 AM IST

  • సీఎల్పీ నేత ఎంపిక బాధ్య‌త‌ను పార్టీ
  • హైక‌మాండ్‌కు అప్ప‌గిస్తూ ఏకవాక్య తీర్మానం
  • తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌
  • బ‌ల‌ప‌ర్చిన సీనియ‌ర్ నేత‌లు: డీకే శివ‌కుమార్‌
  • హోట‌ల్ బ‌య‌ట సీఎం రేవంత్ అంటూ నినాదాలు



విధాత‌: తెలంగాణలో ప్ర‌భుత్వం ఏర్పాటులో భాగంగా సోమ‌వారం ఉద‌యం గ‌చ్చిబౌలిలోని హోట‌ల్ ఎల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన సీఎల్పీ స‌మావేశం ముగిసింది. దీనికి హాజ‌రైన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేత ఎంపిక బాధ్య‌త‌ను పార్టీ హైక‌మాండ్‌కు అప్ప‌గిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు. అయితే, సీఎల్పీ నేత ఎవ‌ర‌నే దానిపై పార్టీ అధిష్ఠానం తుది నిర్ణ‌యం తీసుకోనున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎల్పీ నేత ఎవ‌నే స‌స్పెన్స్ మాత్రం వీడ‌లేదు.


సీఎల్పీ స‌మావేశం ముగిసిన అనంత‌రం పార్టీ రాష్ట్ర ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడు డీకే శివ‌కుమార్ మీడియాతో మాట్లాడారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్య‌త‌ను పార్టీ హైక‌మాండ్‌కు అప్ప‌గిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఏక‌వాక్య‌ తీర్మానం సీఎల్పీ స‌మావేశంలో ప్ర‌వేశ‌పెట్టార‌ని చెప్పారు. దానికి సీనియ‌ర్ నేత‌లు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, సీత‌క్క‌, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు, పొన్న ప్ర‌భాక‌ర్‌, కొండా సురేఖ‌, దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు త‌దిత‌రులు తీర్మానాన్ని బ‌ల‌ర్చిన‌ట్టు తెలిపారు. స‌మావేశంలో పాల్గొన్న అంద‌రూ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, ఏఐసీసీ క‌మిటీ సీఎల్పీ నేత ఎంపిక‌పై తుది నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని చెప్పారు.


ఏక‌వాక్య తీర్మానంపై కాంగ్రెస్ అధిష్ఠానం కూడా త్వ‌ర‌లోనే సీఎల్పీ నేత ఎంపిక‌పై నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు తెలిసింది. మ‌ధ్యాహ్న 2 గంట‌ల వ‌ర‌కు సీఎల్పీ నేత ఎవ‌ర‌నేది ఢిల్లీ అధిష్ఠానం నుంచి స‌మాచారం అందే అవ‌కాశం ఉన్న‌ది. సోమ‌వారం సాయంత్రం లోగా క‌చ్చితంగా సీఎం, డిప్యూటీ సీఎం లేదా ఇద్ద‌రు ముగ్గురు మంత్రులు ప్ర‌మాణం స్వీకారం చేసే అవ‌కాశం ఉన్న‌ది. ఇందుకు సంబంధించి రాజ్‌భ‌వ‌న్‌లో ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి. ఈ మేర‌కు ఇప్ప‌టికే రాజ్‌భ‌వ‌న్‌కు కుర్చీలు, టెంట్లు అక్క‌డికి చేరాయి. కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుకు సంబంధించిన చ‌ర్య‌లు చ‌క‌చ‌క సాగిపోతున్నాయి. ఇదిలా ఉండ‌గా, హోటల్ బ‌య‌ట సీఎం రేవంత్ అంటూ కొంద‌రు కార్య‌క‌ర్త‌లు నినాదాలు చేశారు.

Latest News