గుర్తుల గుబులు.. కోవర్ట్‌ల భయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తుల గుబులుతో పాటు కోవర్టుల భయం కలవర పెడుతుంది.

  • Publish Date - November 29, 2023 / 11:55 AM IST
  • ప్రధాన పార్టీల అభ్యర్థులలో కలవరం


విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తుల గుబులుతో పాటు కోవర్టుల భయం కలవర పెడుతుంది. ముఖ్యంగా అధికార బీఆరెస్ పార్టీ కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్‌, చపాతీ మేకర్ గుర్తులు గులాబీ పార్టీ అభ్యర్థులను గుబులు పెడుతున్నాయి. ఈవీఎం మీద ఉన్న కారు గుర్తుకు దగ్గరగా రోడ్డు రోలర్ చపాతీ మేకర్ గుర్తులుండటం బీఆరెస్ పార్టీ అభ్యర్థులను టెన్షన్ పెడుతుంది.


ఎక్కువగా రైతులు, వృద్ధుల ఓట్లపై ఆశలు పెట్టుకున్న బీఆరెస్ అభ్యర్థులు తమ ఓటర్లు పొరపాటున కారు గుర్తుకు బదులుగా రోడ్డు రోలర్‌, చపాతీ మేకర్‌ గుర్తుల మీద ఓటు వేస్తారేమోనన్న ఆందోళనకు గురవుతున్నారు. గతానుభావాలు కూడా వారిని భయపెడుతున్నాయి. గతంలో నకిరేకల్‌, దుబ్బాక, మునుగోడు వంటి నియోజకవర్గాల్లో గణనీయంగా కారును పోలిన గుర్తులకు ఓట్లు పడ్డాయి. ఈ దఫా ఎన్నికల్లో రోడ్డు రోలర్‌, చపాతీ గుర్తులు నారాయణఖేడ్‌, అందోల్‌, దుబ్బాక, సిద్ధిపేట, గజ్వేల్‌, సంగారెడ్డి, దుబ్బాక, మెదక్‌, జహీరాబాద్ నియోజకవర్గాల అధికార బీఆరెస్ పార్టీ అభ్యర్థులను కలవరపెడుతున్నాయి.


కోవర్టుల కలకలం


ఎన్నికల ప్రచారంలో వెంట ఉన్న వారిలో పోలింగ్ రోజుకల్లా ఎంత మంది నిక్కచ్చిగా తమ విజయం కోసం పనిచేస్తారన్నదానిపై ప్రధాన పార్టీల అభ్యర్థులు అంతర్మథనం చెందుతున్నారు. కొంత మంది గ్రామాల్లో, పట్టణాల్లో తమకంటూ కొంత ఓటు బ్యాంకు కల్గివుండే సీనియర్ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎదుటి పార్టీ అభ్యర్థుల ప్రలోభాలకు లొంగిపోతే ఆ మేరకు పోలింగ్‌లో తమ ఓట్లకు గండిపడుతుందన్న బెంగ అభ్యర్థులను కలవర పెడుతుంది.


అందుకే తమ కుటుంబ సభ్యులతో అటువంటి వారిపై ఓ కన్నేసి పెట్టారు. అయితే బుధవారం పలు నియోజకవర్గాల నుంచి అందిన సమాచారం మేరకు చాల చోట్ల ప్రలోభాలకు లొంగిన నేతలు కోవర్టులుగా మారిపోయారన్న సమాచారం విశ్లేషిస్తే ఎన్నికల్లో పార్టీల గెలుపు ఓటములపై కోవర్టులు ప్రభావం చూపనున్నారని తెలుస్తుంది. అలాగే టికెట్ ఆశించి భంగపడి బుజ్జగింపులతో అభ్యర్థుల వెంట తిరిగిన నాయకుల్లో కూడా పోలింగ్‌లో వారి గెలుపు సాధనకు ఓటింగ్ చేయించకుండా అంటిముంటనట్లుగా కోవర్టు రాజకీయాలు చేయడం కూడా అభ్యర్థులకు ప్రతికూలంగా మారనుంది.