హరీశ్ రావు కామెంట్లతోనే రైతుబంధుకు బ్రేక్‌

రైతుబంధుకు రెండు రోజుల క్రితం ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకోవడానికి మంత్రి టి.హరీశ్ రావు పాలకుర్తి ఎన్నికల ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలే కారణమని ఈసీ పేర్కోనడం పట్ల బీఆరెస్‌, కాంగ్రెస్ ల మధ్య పరస్పర విమర్శలు సాగుతున్నాయి

  • Publish Date - November 27, 2023 / 07:08 AM IST
  • మీవల్లె అంటే మీ వల్లెనంటూ కాంగ్రెస్‌, బీఆరెస్ విమర్శలు


విధాత: రైతుబంధుకు రెండు రోజుల క్రితం ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకోవడానికి మంత్రి టి.హరీశ్ రావు పాలకుర్తి ఎన్నికల ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలే కారణమని ఈసీ పేర్కోనడం పట్ల బీఆరెస్‌, కాంగ్రెస్ ల మధ్య పరస్పర విమర్శలు సాగుతున్నాయి. రైతుబంధు అనుమతి సందర్భంగా తాము విధించిన షరతులకు విరుద్ధంగా మంత్రి టి.హరీశ్ రావు ఎన్నికల ప్రచారంలో రైతుబంధు డబ్బుల పంపిణీని ప్రస్తావించడం తమ దృష్టికి వచ్చిందని ఉపసంహరణ ఉత్తర్వుల్లో ఈసీ పేర్కోంది.


ఎన్నికల ప్రక్రియ ప్రచారంలో అందరికి సమాన అవకాశాల కోణంలో రైతుబంధుకు ఇచ్చిన అనుమతి ఉపసంహరించుకున్నట్లుగా ఈసీ పేర్కోంది. రైతుబంధు ఉపసంహరణకు తన వ్యాఖ్యలే కారణమంటూ ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కోనడం పట్ల హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను రైతుబంధుకు అనుమతి రావడంపై ధర్మం…న్యాయమే గెలిచిందని మాత్రమే చెప్పానని, కాంగ్రెస్ పార్టీనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రైతుబంధును ఆపించిందని ఆరోపించారు.


రైతుబంధును కాంగ్రెస్ వాళ్లు ఎన్ని రోజులు అడ్డుకుంటారని తమ ప్రభుత్వం మళ్లీ వస్తుందని వెంటనే రైతుల ఖాతాల్లో రైతుబంధు వేస్తామన్నారు. అటు మంత్రి కేటీఆర్ సైతం కాంగ్రెస్‌, బీజేపీలు కుమ్మక్కై రైతుబంధును ఆపించాయని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రైతుల నోటీకాడ బుక్కను కాంగ్రెస్ గుంజేసిందని, రైతు వ్యతిరేక విధానాన్ని చాటుకుందని విమర్శించారు. ఇప్పటికైనా రైతుబంధు కావాలో రాబందుల కాంగ్రెస్‌ కావాలో రైతులు తేల్చుకోవాలన్నారు.


ఆందోళన వద్దు.. మేం రాగానే 15వేలు వేస్తాం: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి


రైతుబంధుకు ఈసీ బ్రేక్ వేయడంపై బీఆరెస్ పార్టీ కాంగ్రెస్‌ను విమర్శించడాన్ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. రైతుబంధు అనుమతి ఉపసంహరణకు హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలే కారణమని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కోందని గుర్తు చేశారు., రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, అతృత, అహంకారం తప్ప నిజంగా రైతులుకు మేలు చేయాలన్న ఉద్ధేశం మామాఅల్లుళ్లకు లేదన్నారు. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరుగదన్నారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దన్నారు. పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే 15వేల రైతుభరోసా మీ ఖాతాల్లో వేస్తామని రేవంత్ ప్రకటించారు.