Congress
- త్వరలో ప్రాజెక్టుల యాత్ర
- పాదయాత్రలో వెల్లడైన ప్రభుత్వ వ్యతిరేకత
విధాత: పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో వెలుగుచూసిన ప్రజాసమస్యలు, అవసరాలను పార్టీ ఎజెండాగా పెట్టుకుని అధికారంలోకి వచ్చాకా వాటి పరిష్కారానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గన్ పార్కు వద్ధ అమర వీరుల స్థూపానికి నివాళులర్పించిన భట్టి అనంతరం గాంధీభవన్‌కు చేరుకుని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మాజీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రభృతులతో కలిసి విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తాను చేపట్టి పూర్తి చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విశేషాలను విలేఖరుల సమావేశంలో వివరించారు. గద్దర్‌తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, నాయకులతో పాటు తన పాదయాత్రకు సంఘీభావం ప్రకటించిన వారికి, పాల్గొని మద్ధతునిచ్చిన వారికి భట్టి కృతజ్ఞతలు తెలిపారు.
ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు 109రోజులు, 17జిల్లాలు, 36 నియోజకవర్గాలు,700గ్రామాల మీదుగా 1364కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో తెలంగాణ ఏర్పాటు లక్ష్యం, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్న నిరాశ ప్రజల్లో ప్రస్ఫుటించిందన్నారు. సమాజంలో ఆర్ధిక వ్యత్యాసాలు పెరిగిపోయాయన్నారు. పెరిగిన తెలంగాణ సంపద ప్రజలకు చేరకుండా బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల పాలవుతుందన్నారు.
తెలంగాణలో గడీల సంస్కృతిని మళ్లీ కేసీఆర్, ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫామ్‌హౌజ్‌లతో తీసుకొచ్చారన్నారు. అప్రజాస్వామిక పాలన తెలంగాణలో సాగుతుందని, బహుజన హక్కులు అణిచివేయబడుతున్నాయన్నారు. నీళ్లు, నిధులు, నియమకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అవన్ని నెరవేరకపోగా, రైతులు పండించిన పంటలను సైతం సక్రమంగా అమ్ముకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు లేవని, పోడు భూముల సమస్యలు పెరిగాయని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పంంచిన భూములను తిరిగి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల నుండి లాగేసుకుంటుందన్నారు. విద్యా సంస్థలు నిర్వీర్యమైపోగా, నిరుద్యోగులు నిరాశ నిస్పృహలో ఉన్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై పాదయాత్రలో అడుగడుగునా ప్రజావ్యతిరేకత వెల్లడైందన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల పేరుతో అవినీతి జరిగిందే తప్ప కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ ఎస్ ప్రభుత్వం మూలన పడేసిందన్నారు. విద్యుత్తు రంగంలో నిరంతర ఉచిత విద్యుత్తు రైతులకు అందడం లేదన్నారు. వృత్తి దారుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.
ఈ సందర్భంగా తన పర్యటనలో జిల్లాల వారిగా ఆయా రంగాల్లో గుర్తించిన సమస్యలను భట్టి మీడియాకు వివరించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రాజెక్టుల యాత్ర చేపడుతామన్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి పెట్టిన ఖర్చు, ప్రయోజనాలను ప్రజలకు యాత్ర ద్వారా వివరిస్తామన్నారు.
కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను బీఆర్ ఎస్ నిర్లక్ష్యం చేసిన తీరుపై ప్రాజెక్టుల వద్ధ సెల్ఫీలు దిగి తెలంగాణ సమాజం ముందుంచుతామన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకవచ్చి సంపద అందరికి పంచేలా చూస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ పేటెంట్ స్కీమ్ అని భట్టి పునరుద్ఘాటించారు.