– చైర్ పర్సన్ పదవి కోరితే అంగీకరించలేదు
– నా ఇంటిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
-సూర్యాపేట 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్
విధాత, నల్గొండ బ్యూరో: బహుజనులకు మద్దతు ఇవ్వడానికే తాను, తన భార్య గండూరి పావని లు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఎస్పీలో చేరామని గండూరి కృపాకర్ అన్నారు. సూర్యాపేట లోని తన నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొందరు కౌన్సిలర్లు తమ ఇంటి ముందు విధ్వంసం చేయడం ద్వారా సూర్యాపేటలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సూర్యాపేట ప్రశాంతంగా వుందని 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు. అగ్రవర్ణాలకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడం ఇష్టం లేకనే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వలేదని, బహుజనులకు మద్దతు ఇవ్వడానికే బీఎస్పీలో చేరామని అన్నారు. ఏనాడు డబ్బుకు ఆశపడలేదని, తాను దళిత చైర్ పర్సన్ అన్నపూర్ణకు మద్దతు ఇవ్వడం లో తప్పులేదని అన్నారు. తమ ఇంటిపై దాడి అమానుష చర్యగా అభివర్ణించారు. ఆదివారం మధ్యాహ్నం విద్యానగర్ లోని తమ ఇంటి వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెందిన కొందరు కౌన్సిలర్లు రెండు గంటల పాటు విధ్వంసం చేశారని ఆమె ఆరోపించారు. ఇప్పటికైనా తమ ఇంటిపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
– సూర్యాపేటలో ప్రజాస్వామ్యం ఉందా?
సూర్యాపేటలో ప్రజాస్వామ్యం ఉందా అని కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ప్రశ్నించారు. తన భర్త గండూరి కృపాకర్ ఇంట్లో లేని సమయంలోవార్డు కౌన్సిలర్ అయిన తాను, కుమార్తె ఇంట్లో వున్న సమయంలో మా ఇంటి ముందు రెండు గంటల పాటు విధ్వంసం చేసి, మమ్ములను భయబ్రాంతులకు గురిచేశారని అన్నారు. తాను కొండపల్లి నిఖిలను చైర్మన్ పదవికి మద్దతు ఇవ్వలేదని, వారితో కలిసి క్యాంప్ నకు వెళ్లలేదని, వారి నుండి ఎటువంటి డబ్బు తీసుకోలేదని చెప్పారు. విద్యానగర్ 45వ వార్డులో ప్రజాదరణ కలిగిన నాయకురాలినని, ప్రజా సేవకైనా స్వంత డబ్బులు ఖర్చు పెట్టాను తప్ప ఏనాడు ఎవరి వద్దా తీసుకోలేదని తెలిపారు. తాము బీఎస్పీ నుండి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరతామని వారు చెప్పారు.
– డబ్బు ఆశచూపి తనపై ఉసిగొల్పారు : చైర్ పర్సన్
మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ మాట్లాడుతూ దళిత మహిళను చైర్ పర్సన్ పదవి నుండి దించడానికి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ లకు డబ్బు ఆశచూపి తనపై ఉసికొల్పారని ఆరోపించారు. అయితే వారి ప్రయత్నాలు విఫలం కావడంతో తట్టుకోలేక గండూరి పావని కృపాకర్ ఇంటిపై దాడులు చేశారన్నారు. అడ్డుకున్న తనపై, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వై వెంకటేశ్వర్లుపై విచక్షణ లేకుండా దాడులు చేశారని ఆరోపించారు. తమపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేటలో కాంగ్రెస్, బీజేపీలు ఏకమై బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారని అన్నారు. గత పదేళ్ల కాలంలో సూర్యాపేట పట్టణంలో ఏ పార్టీ నాయకులపైనా దాడులు జరగలేదని, ప్రజలు ప్రశాంతంగా జీవించారని చెప్పారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని వారు అన్నారు. పోలీసులు పక్షపాతం లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. గండూరి పావని కృపాకర్ ఇంటిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఆకుల లవకుశ, కౌన్సిలర్ నిమ్మల స్రవంతి పాల్గొన్నారు.