- చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ పై కాంగ్రెస్ చార్జి షీట్
- తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా కోట్లకు పడగలెత్తారని ఆరోపణ
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) పాదయాత్ర సందర్భంగా ఆయా నియోజక వర్గాల శాసనసభ్యులపై ఛార్జిషీట్లను విడుదల చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి నేత సుంకె రవిశంకర్ (Sunke Ravi Shankar)పై ఓ చార్జిషీట్ రూపొందించింది.
తన నియోజకవర్గంలో ఎస్సై, సీఐ పోస్టుల నియామమకాలలో రవిశంకర్ వారి నుండి లక్షల్లో డబ్బు వసూలు చేశాడని ఆరోపించింది. అవినీతికి సొమ్ముతో ఆయన ఖరీదైన అపార్ట్మెంట్లు కట్టాడని వెల్లడించింది. జాతీయ రహదారుల వెంబడి కోట్ల రూపాయల విలువైన స్థలాలు కొన్నారని కాంగ్రెస్ పార్టీ తన చార్జిషీట్ లో వివరించింది.
నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులను ఆయన నట్టేటముంచారని తెలిపింది. పదవులు ఇప్పిస్తానంటూ సొంత పార్టీ నేతల దగ్గరే లక్షలు వసూలు చేశాడని పేర్కొంది. కూతురి పెళ్లికి సైతం నియోజకవర్గ పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీల ఇతర ప్రజాప్రతినిధుల నుంచి డబ్బు వసూలు చేశాడని కాంగ్రెస్ తన చార్జిషీట్ లో ఆరోపణలు చేసింది. 2018లో తొలిసారి చొప్పదండి నుండి శాసనసభ్యునిగా ఎన్నికైన రవిశంకర్ కోట్లకు పడగలెత్తారని స్పష్టం చేసింది.