విధాత, వరంగల్: వృద్ధాప్యంలో కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కొడుకు అర్ధాంతరంగా అసువులు బాయడంతో ఆ కుటుంబం తల్లడిల్లుతోంది. ఉద్యోగం సంపాదించి ఇంటికి ఆసరాగా ఉంటాడనుకుంటే ఆ ఉద్యోగ ప్రయత్నం నా కొడుకు ప్రాణాలను తీసిందని ఆవేదనవ్యక్తం చేశారు.
పోలీసు ఉద్యోగం కోసం గత రెండు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్న కొడుకు ఆ ఉద్యోగం కోసం జరిగిన ప్రయత్నంలో విగత జీవిగా మారడం పలువురిని కంటతడి పెట్టించింది. ఆపద ఎదురైనా హాస్పిటల్ నుంచి ఇంటికి క్షేమంగా చేరుకుంటాడని అనుకుంటే శవం ఇంటికి వచ్చిందని కంటనీరు పెడుతున్నారు.
ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసు ఉద్యోగం కోసం ఫిజికల్ టెస్ట్ లో పాల్గొని తీవ్ర అస్వస్థతకు లోనై ఎంజీఎం లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అభ్యర్థి బానోతు రాజేందర్ సోమవారం రాత్రి మృతి చెందాడు.
హన్మకొండలో జరిగిన పోలీస్ ఉద్యోగాల ఎంపిక వల్ల ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. గత శనివారం KUలో 1600 మీటర్ల పరుగు పందెంలో ములుగు జిల్లా పందికుంట శివారు శివతండకు చెందిన బానోత్ రాజేందర్ పాల్గొన్నారు. పరుగు పందెం మధ్యలోనే కుప్పకూలి పడిపోయాడు.
కోమాలోకి వెళ్లిన రాజేందర్ ను పోలీస్ సిబ్బంది ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. రెండు రోజుల చికిత్స అనంతరం సోమవారం రాత్రి మృతి చెందాడు. ఆరోగ్యంగా వస్తాడనుకున్న కొడుకు విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.