అసోంలో నియోజకవర్గాల విభజనకు ఒకే! మరి ఇక్కడ?

ఆర్టికల్ 170 ప్రకారం చేప‌ట్ట‌నున్న నియోజకవర్గాల పునర్విభజన ఆ ఆఫర్ తెలుగు రాష్ట్రాలకు లేదా! విధాత‌: ఈశాన్య రాష్ట్ర‌మయిన అసోంలో అసెంబ్లీ నియోజకవర్గాలను విభజించి వాటి సంఖ్య పెంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుని ప్రక్రియ ప్రారంభించింది. మరి ఈ ఆఫర్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు లేదా అని నాయకులు, ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అసోం లో 14 లోక్ సభ సీట్లు, ఏడు రాజ్యసభ, 126 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అసోంలో చివరిసారిగా 1976లో […]

  • Publish Date - December 29, 2022 / 04:27 PM IST
  • ఆర్టికల్ 170 ప్రకారం చేప‌ట్ట‌నున్న నియోజకవర్గాల పునర్విభజన
  • ఆ ఆఫర్ తెలుగు రాష్ట్రాలకు లేదా!

విధాత‌: ఈశాన్య రాష్ట్ర‌మయిన అసోంలో అసెంబ్లీ నియోజకవర్గాలను విభజించి వాటి సంఖ్య పెంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుని ప్రక్రియ ప్రారంభించింది. మరి ఈ ఆఫర్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు లేదా అని నాయకులు, ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం అసోం లో 14 లోక్ సభ సీట్లు, ఏడు రాజ్యసభ, 126 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అసోంలో చివరిసారిగా 1976లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అపుడు 1971 లెక్కలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇపుడు 2001 జనాభా లెక్కల ఆధారంగా కొత్త నియోజకవర్గాలు ఎన్ని కావాలో అంచనా వేస్తారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను 2014లో రెండుగా విభజించారు. ఆ సమయంలో విభజన చట్టంలో ఏమన్నారంటే ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లను 225గానూ, తెలంగాణలో ఉన్న 119 సీట్లను 153కి పెంచాలని చట్టంలో వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం ఈ పునర్విభజన సాగాలని పేర్కొన్నారు.

కానీ ఇప్పటికీ ఈ హామీని అమలు చేయలేదు. అంతే కాదు 2026 వరకూ ఏపీ తెలంగాణాలలో పునర్విభజన ఉండదని కేంద్రం ఇటీవల తేల్చేసింది. ఇదిలా ఉంటే సెక్షన్ 27 ప్రకారం నియోజకవర్గాలను ఎపుడైనా విభజించే హక్కు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది.

అయినా సరే ఏపీ తెలంగాణ‌ల విషయంలో మాత్రం ఈ విభజన హామీని ఎందుకో నెరవేర్చడం లేదు అని అంటున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగానే ప్రస్తావించింది. పెండింగ్‌లో ఉన్న అన్ని విభజన సమస్యలను కూడా పరిష్కరించాలని, హామీలను తీర్చాలని కోరింది.

దీని మీద కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా విభజన హామీలను తక్షణం నెరవేర్చేలా చూడాలని ఏపీ సర్కార్ కోరింది. అయితే ఈ సీట్ల పెంపు ద్వారా తమకు రాజకీయంగా లాభం ఉంటే తప్ప బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోదని అంటున్నారు.