సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు (Supreme Court) శనివారం నోటీసులు జారీ చేసింది. గత నెలలో సనాతన నిర్మూలన అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సనాతనం కరోనా, డెంగ్యూ, మలేరియా వంటిదని వ్యాఖ్యానించారు.
దానిని వ్యతిరేకించకూడదని, పూర్తిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. దీనిపై దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదుకాగా.. బి జగన్నాథ్ అనే వ్యక్తి ఉదయనిధిపై ఎఫ్ఐఆర్‌కు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ధ బోస్, బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. ఉదయనిధి స్కూల్ విద్యార్థులతో మాట్లాడుతూ పలానా మతం చెడ్డదని.. పలానా మతం మంచిదని చెబుతున్నారని పేర్కొన్నారు.
గతంలో ఒక మతంపై ఇదే రకమైన వ్యాఖ్యలు చేసినపుడు సుప్రీంకోర్టు విచారణ చేసిందని.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది ఒక మంత్రి కావడం సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయమని ఆయన ధర్మాసనానికి నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం, మంత్రి ఉదయనిధిలకు నోటీసులు జారీ చేసింది.