Site icon vidhaatha

HCU భూములపై.. సుప్రీంలో ప్రభుత్వం అఫిడవిట్!

విధాత : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ భూములపై ఏప్రిల్ 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములేనని ఆ అఫిడవిట్‌లో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ భూముల్లోనే సెంట్రల్ యూనివర్శిటీ, మరికొన్ని ఇనిస్టిట్యూట్‌లు, బస్టాండ్ లు తదితర సౌకర్యాలు ఎన్నో వచ్చాయని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వివరాలతో సహా వివరించింది. సుమారు 20 ఏళ్లకుపైగా 400 ఎకరాల స్థలం న్యాయ వివాదంలో ఉన్నందున అక్కడ చెట్లు మొలిచి.. అటవీ ప్రాంతంగా మారిందని ఈ అఫిడవిట్‌లో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతే తప్ప అది ఆటవీ భూమి కాదని తెలిపింది. అయితే కంచ గచ్చిబౌలి భూములు వివాదాస్పదం కావడంతో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉండి.. సీనియర్ న్యాయవాదులతో చర్చించి.. ఈ అఫిడవిట్‌ను సిద్దం చేశారు. సోమవారం దీనిని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.

హెచ్ సీయూ భూములు 400ఎకరాలను ప్రభుత్వం టీజీఐఐసీకి అప్పగించడంతో వాటిని స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేసే ఆలోచనతో ప్రభుత్వం చదునుకు ప్రయత్నించింది. ఈ సందర్భంగా అందులోని పచ్చదనం ధ్వంసమై.. వణ్యప్రాణులు చెల్లాచెదురవ్వడం..విద్యార్థుల ఆందోళన వివాదస్పదమైంది. సుప్రీంకోర్టు వివాదాన్ని సుమోటోగా తీసుకుంది. కంచ గచ్చిబౌలిలో చెట్లు నరకవద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూముల వ్యవహారంలో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే భూములపై క్షేత్ర స్థాయి అధ్యయనం చేసి నివేదిక అందించేందుకు సాధికారిక కమిటీని నియమించింది.

Exit mobile version