కోల్‌కతా : కలకత్తా హైకోర్టులో రెండు బెంచ్‌ల మధ్య నెలకొన్న వివాదానికి సుప్రీంకోర్టు తాత్కాలికంగా ఫుల్‌స్టాప్ పెట్టింది. బెంగాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లపై సీబీఐ విచారణ కోరుతూ కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో పలువురు అడ్మిషన్లు పొందారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ అవసరం లేదని డివిజన్ బెంచ్ జడ్జి సౌమేన్ సేన్ తెలిపారు. డివిజన్ బెంచ్ నిర్ణయంపై మళ్లీ సింగిల్ జడ్జి బెంచ్ జోక్యం చేసుకుంది. జస్టిస్ సౌమేన్ సేన్, జస్టిస్ ఉదయ్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ నిర్ణయం అక్రమం, చట్ట విరుద్ధమని సింగిల్ జడ్జి బెంచ్ పేర్కొంది. అయితే జస్టిస్ సౌమేన్ సేన్ రాజకీయ పార్టీ కోసం పని చేస్తున్నారని అభిజిత్ గంగోపాధ్యాయ పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఈ వివాదాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును శనివారం విచారించింది. ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ల స్కామ్‌లో కలకత్తా హైకోర్టులోని రెండు బెంచ్‌ల ముందు నడుస్తున్న మొత్తం కేసు విచారణ ప్రక్రియపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 29కివాయిదా వేసింది. అయితే ఈ కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, పిటిషనర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.