గగనవీధిలో అబ్బురపరుస్తున్న క్రిస్మస్‌ ట్రీ.. నాసా వెరైటీ శుభాకాంక్ష‌లు

క్రిస్మ‌స్ పండ‌గ నేప‌థ్యంలో నాసా విభిన్నంగా శుభాకాంక్ష‌లు తెలిపింది. ఆ పండ‌గ అంటే వెంట‌నే గుర్తొచ్చే క్రిస్మ‌స్ ట్రీని పోస్ట్ చేస్తూ శుభాకాంక్ష‌లు తెలిపింది

  • Publish Date - December 23, 2023 / 09:07 AM IST

క్రిస్మ‌స్ పండ‌గ నేప‌థ్యంలో నాసా (NASA) విభిన్నంగా శుభాకాంక్ష‌లు తెలిపింది. ఆ పండ‌గ అంటే వెంట‌నే గుర్తొచ్చే క్రిస్మ‌స్ ట్రీని పోస్ట్ చేస్తూ శుభాకాంక్ష‌లు తెలిపింది. అయితే అది ఎవ‌రో మ‌నుషులు, మెషీన్‌లు త‌యారు చేసింది కాదు. అంత‌రిక్షం త‌న కుంచెతో వేసిన చిత్రం. ఎన్‌జీసీ 2264 అనే న‌క్ష‌త్రాల గుంపు చూడ‌టానికి అచ్చం క్రిస్మ‌స్ ట్రీ లానే ఉంటుంది. దానిని చిత్రించిన నాసా.. ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ ప్ర‌జ‌లంద‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపింది. ఈ న‌క్ష‌త్ర స‌మూహం మ‌న‌కు 2500 కాంతి సంవ‌త్స‌రాల దూరంలో ఉంటుంని నాసా పేర్కొంది.


చంద్ర ఎక్స్‌రే అనే అబ్జ‌ర్వేట‌రీ ఈ ఖ‌గోళ అద్భుతాన్ని తీసింద‌ని.. అక్క‌డ ఒక కొత్త ప్ర‌పంచమే రూపుదిద్దుకుంటున్న‌ట్లు ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఈ ఫొటోలో ప‌చ్చ‌గా క‌నిపిస్తున్న‌దంతా ఆ నెబ్యులాలో ఉన్న గ్యాస్ అని తెలుస్తోంది. నేష‌న‌ల్ సైన్స్ ఫౌండేష‌న్‌కు చెందిన డ‌బ్ల్యూఐవైఎన్ 0.9 మీట‌ర్ టెలిస్కోప్ ద్వారా ప‌రిశోధ‌కులు ఈ విష‌యాన్ని తెలుసుకున్నారు. య‌థాత‌థంగా ఆ న‌క్ష‌త్ర మండ‌లం ఫొటోలో చూపిస్తున్న‌ట్లు లేక‌పోవడంతో తాము 160 డిగ్రీల వంపు తిప్పిన‌ట్లు వారు పేర్కొన్నారు.


ఎన్‌జీసీ2264 క్ల‌స్ట‌ర్ లో ఉండేవ‌న్నీఇప్పుడిప్పుడే రూపొందిన రూపొందుతున్న న‌క్ష‌త్రాల‌ని నాసా వెల్ల‌డించింది. వీటి వ‌య‌సు 10 ల‌క్ష‌ల ఏళ్ల నుంచి 50 ల‌క్ష‌ల ఏళ్ల వ‌ర‌కు ఉంటుంద‌ని.. మ‌న పాల‌పుంత‌లోనే ఉన్న ఇవి.. భూమికి 2500 కాంతి సంవ‌త్స‌రాల దూరంలో ఉన్నాయ‌ని పేర్కొంది. ఈ న‌క్ష‌త్రాల్లో కొన్ని మ‌న సూర్యుడి కంటే చిన్న‌గా.. మ‌రికొన్ని పెద్ద‌గా ఉండ‌గా వాటి బ‌రువులోనూ తేడాలు ఉన్నాయి.




త్రీడీ ప్రింటెడ్ రాకెట్ ఇంజెన్‌ను ప‌రీక్షించిన నాసా..


నాసా తొలిసారి త్రీడీలో ప్రింట్ (3D Printed Rocket Engine) ద్వారా త‌యారు చేసిన రాకెట్ ఇంజిన్‌ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. దీనికి రొటేటింగ్ డిటోనేష‌న్ రాకెట్ ఇంజిన్ (ఆర్‌డీఆర్ఈ) అనే పేరుతో పిలుచుకునే ఈ ఇంజిన్ ప‌రీక్ష‌కు నాసా ఇన్ ఫాల్ 2023 అని పిలుస్తోంది. అలాబామా రాష్ట్రంలోని హంట్స్‌విల్లేలో ఉన్న మార్ష‌ల్ స్పేస్ ఫ్లైట్ సెంట‌ర్‌లో ఈ ప్ర‌యోగం జ‌రిగింది. ఈ ప్ర‌యోగంలో త్రీడీ రాకెట్ ఇంజిన్ 5800 పౌండ్ల థ్ర‌స్ట్‌ను ఉత్ప‌త్తి చేసిన‌ట్లు నాసా వెల్ల‌డించింది.


ఈ శ‌క్తి భూమి నుంచి ఉప‌గ్ర‌హాల‌ను తీసుకెళ్ల‌డానికి స‌రిపోయేంత స్థాయిలోనే ఉంద‌ని ఈ ప్ర‌యోగాన్ని ప‌ర్య‌వేక్షించిన థామ‌స్ టీస్లే వెల్ల‌డించారు. ఈ ప్ర‌యోగం నాసాకు ఎంతో విలువైన‌ది. ఇంజిన్ల‌ను త‌యారుచేయ‌డానికి ప్ర‌స్తుతం సుదీర్ఘ‌కాలం వేచి ఉండాల్సి వ‌స్తోంది. త్రీడీ ఇంజిన్ల ప‌నితీరుపై న‌మ్మ‌కం వ‌స్తే వీటిని మ‌రింత అభివృద్ధి ప‌రిచి భారీ ప్ర‌యోగాలు చేసే ఉత్ప‌త్తి చేయొచ్చు అని శాస్త్రవేత్త‌లు పేర్కొన్నారు.


త్రీడీ ఇంజిన్ల ప‌నితీరుపై ఇది రెండో ప్ర‌యోగం కాగా.. మొద‌టి దాన్ని 2022 వేస‌వికాలంలో నాసా చేప‌ట్టింది. ఆ స‌మ‌యంలో ఇంజిన్ కేవ‌లం 4000 పౌండ్ల థ్ర‌స్ట్‌ను మాత్ర‌మే ఉత్ప‌త్తి చేయ‌గా.. ఇప్పుడు అది 6000 ద‌గ్గ‌ర‌కు రావ‌డం విశేషం. వివిధ ద‌శ‌ల్లో ఇంజిన్ త‌న సామ‌ర్థ్యాన్ని పెంచుకుంటూ త‌గ్గించుకుంటూ ఉండాలి. అలాంటి ప‌నితీరును త్రీడీ ఇంజిన్లు ఎంత మాత్రం నిర్వ‌హిస్తాయ‌నే దానిపై ప‌రిశోధ‌కుల‌కు అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేసుకునేందుకే ఈ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని నాసా వెల్ల‌డించింది.

Latest News