Murder Case Solved | ఎలాంటి క్లూ వదల్లేదని కొందరు నేరస్తులు భరోసాతో ఉంటారు! కానీ.. ఆ నేరస్తులకు కూడా తెలియని ఆధారాలు బయటకు తీసే సత్తా ఉన్నోళ్లూ ఉంటారని నిరూపించారు మధ్యప్రదేశ్ పోలీసులు. ఎలాంటి ఆధారాలు లేని ఒక హత్య కేసును చాకచక్యంతో ఛేదించారు. కృత్రిమ మేథ, ఒక చిన్న ఆమ్లెట్ ముక్క, ఒక యూపీఐ పేమెంట్.. వీటి మధ్య సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసిన పోలీసులు.. నేరస్తులను పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే..
డిసెంబర్ 29, 2025! మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గోళా కా మందిర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ శవం లభ్యమైంది. అదంతా అటవీ ప్రాంతం. మనుషులు ఎవరు వచ్చి వెళ్లారో రికార్డు చేసే సీసీటీవీ ఏర్పాట్లు లేవు. కానీ.. అక్కడ ఘాతుక మర్డర్ చోటుచేసుకుంది. శవాన్ని గుర్తుపడదామని చూస్తే.. ముఖ కవళికలు కనీసం గుర్తించడానికి వీల్లేని విధంగా బండరాయితో చిదిమేసినట్టు ఉంది. దీంతో మొదట్లోనే పెద్ద సవాల్ ఎదురైంది. సాధారణంగా ముఖం ఆనవాళ్లను బట్టి.. శవాన్ని గుర్తించే సంప్రదాయ పద్ధతి అయితే పని సులువ అయ్యేది. కానీ.. ఈ ఘటనలో ఆ అవకాశం లేకుండా పోయింది.
ఈ హత్యపై సీనియర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పీ) ధరమ్‌వీర్‌సింగ్ స్పందిస్తూ.. ఇదొక ‘అత్యంత కిరాతక హ‘త్య, ప్రారంభంలో ఎలాంటి ఆధారాలు లేని కేసు’ అని అభివర్ణించారు. అయితే.. ఈ కేసులో దర్యాప్తు చేసిన ఫోరెన్సిక్ బృందానికి ఒక చిన్న ఆమ్లెట్ ముక్క దొరికింది. అన్నిటినీ అనుమానంగా చూసే ఫోరెన్సిక్ బృందాలు.. దీన్ని ఒక కీలకమైన క్లూగా పరిగణించారు.
దాని ఆధారంగా ఘటనా స్థలానికి సుమారుగా 200 మీటర్ల దూరంలోని అన్ని ఫుడ్ స్టాల్స్ యజమానులను పోలీసులు విచారించారు. ఒక హోటల్‌లో ఆ మహిళ తాలూకు ఆచూకీ లభించింది. ఈమె తన హోటల్‌లో ఆమ్లెట్ తిన్నదని దాని యజమాని ధృవీకరించాడు. ఆమెతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పాడు. దీంతో పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు తాము తిన్నదానికి బిల్లును యూపీఐ ద్వారా చెల్లించడాన్ని గమనించారు. అక్కడి నుంచి యూపీఐ చెల్లింపును ట్రాక్ చేశారు. నిందితుడు దొరికేశాడు. గ్వాలియర్‌కు చెందిన సచిన్ సేన్ అనే వ్యక్తిని మంగళవారం ఉదయం అరెస్టు చేశారు.
అయితే.. ఈ కేసులో పోలీసులు శవాన్నిగుర్తించే సమస్యను అధిగమించేందుకు భౌతిక దర్యాప్తుతో పాటు.. కృత్రిమ మేధను సైతం ఉపయోగించారు. చనిపోయిన మహిళ ముఖాన్ని ఏఐ ఆధారంగా పునఃసృష్టించారు. ఈ డిజిటల్ స్కెచ్ ఆధారంగా టికామ్‌గఢ్ పోలీసులతో గ్వాలియర్ పోలీసులు సమన్వయం చేసుకున్నారు. మృతురాలిది అదే జిల్లాగా గుర్తించారు. మృతురాలు అంతకు ముంద భర్తతో కలిసి జీవించేది. చనిపోవడానికి వారం రోజుల ముందు సచిన్ సేన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి కలిసే ఉంటున్నారు. అయితే.. మృతురాలికి ఇతరులతోనూ సంబంధాలు ఉన్నాయని అనుమానించిన సచిన్ సేన్.. ఆ ద్వేషంతో ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడని ఎస్‌ఎస్‌పీ సింగ్ తెలిపారు.
‘ఆ మహిళను ప్రధాన రహదారికి సమీపంలోని ఒక ఫారెస్ట్ ఏరియాలోకి తీసుకువెళ్లి.. అక్కడ ఒక బండరాయితో ఆమె తలను మోది హ‘త్య చేశాడు. అక్కడ ఒక జాకెట్, ఇతర కొన్ని వస్తువులు దొరికాయి’ అని ఆయన వెల్లడించారు. ఈ కేసులో చిన్న చిన్న సాక్ష్యాధారాలు, సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ పరిశోధన.. అన్నీ కలిసి నేరస్తుడిని పట్టించాయని సీనియర్ పోలీసుల అధికారులు తెలిపారు.
