Comet season October | తోకచుక్కలు చందమామ కథల్లో చాలా ఫేమస్. తోకచుక్క పేరుతో పెద్ద సీరియల్ అప్పట్లో చందమామలో వచ్చింది. అప్పుడప్పుడు తోకచుక్కలు భూమికి సమీపం నుంచి వెళుతూ ఉంటాయి. ఒక కాంతివంతమైన చుక్క… దానికి తోకలా కొంత భాగం మెరుస్తూ చూడటానికి ఆసక్తిరేపుతాయి. ప్రస్తుతం ఆకాశంలో మూడు తోకచుక్కలు ఉన్నాయి. అవి.. C/2025 K1 (ATLAS), C/2025 R2 (SWAN), C/2025 A6 (లెమ్మన్). అయితే, వాటిని మనం కంటితో నేరుగా చూడలేం. వీటిలో రెండింటిని అత్యంత శక్తిమంతమైన టెలిస్కోపుల ద్వారా చూడవచ్చు. అయితే.. మూడో తోకచుక్క మాత్రం హాలోవీన్ తోకచుక్కగా మారడంతో కంటితో చూసేందుకు కొంత అవకాశం ఉంది. మొత్తంగా రాబోయే కొన్నివారాలు ఖగోళ శాస్త్రజ్ఞులకు, ఆకాశంలో వింతలు చూడాలనుకునే వారికి కంటికి పండగే.
C/2025 K1 (ATLAS)
2025 మే నెలలో తొలిసారి ఈ తోకచుక్క కనిపించింది. ఇది వచ్చే నెల అంటే 2025, నవంబర్, 24–25 తేదీల్లో భూమికి సమీపంలోకి రానున్నది. అయితే.. అది సూర్యకాంతిలో కలిసిపోయింది. కానీ.. అక్టోబర్ 8న సూర్యుడికి సమీపంలో ఉన్న పెరిహెలియన్ నుంచి అది కనుక బయటపడగలిగితే.. అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యునికి దగ్గరయ్యే కొద్దీ అది మరింత ప్రకాశవంతంగా ఉంటున్నది. అది మనుగడ సాగించినప్పటికీ.. చాలా కొద్ది మందికి మాత్రమే చూసే వీలు కలుగుతుంది. C/2025 K1 (ATLAS) తోకచుక్క.. నవంబర్ నెలాఖరు వరకూ హోరిజోన్ కింద ఉంటుంది. ఇది భూమి నుంచి దాదాపు 40 మిలియన్ మైళ్ల దూరంలో.. చాలా మసకగా ఉంటుంది.
C/2025 R2 (SWAN)
ఈ తోకచుక్కను ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త వ్లాదిమిర్ బెజుగ్లీ కనిపెట్టారు. నాసాకు చెందిన సోలార్ అండ్ హెలియోస్ఫెరిక్ అబ్జర్వేటరీ (SOHO) నుంచి చిత్రాలను స్కాన్ చేస్తున్న సమయంలో సెప్టెంబర్ 11, 2025న దీనిని గుర్తించాడు. ఈ తోకచుక్క ప్రస్తుతం భూమికి 50 మిలియన్ మైళ్ల దూరంలో ఉంది. ఇప్పటికే ఈ తోకచుక్క పెరిహెలియన్ నుంచి బయటపడింది. ప్రస్తుతం పశ్చిమ హోరిజోన్‌ను తాకుతున్నది. ఇది ప్రకాశవంతంగా మారుతూ అక్టోబర్ 19వ తేదీన భూమికి అత్యంత సమీపంలోకి రానున్నది. ఆ సమయంలో ఆ తోకచుక్క మనకు 24 మిలియన్ మైళ్ల దూరంలోకి వస్తుంది. అయినప్పటికీ C/2025 R2 (SWAN)ను సైతం టెలిస్కోప్ ద్వారానే చూడగలుగుతాం.
C/2025 A6 (Lemmon)
ఈ ఏడాది మనం నేరుగా కంటితో చూడలిగే ఏకైక తోకచుక్క C/2025 A6 (Lemmon). అరిజోనాలోని మౌంట్ లెమ్మన్‌పై ఉన్న టెలిస్కోప్ ద్వారా జనవరి 3వ తేదీన దీనిని గుర్తించారు. ఇప్పటికే వందల సార్లు ఈ తోకచుక్కను శాస్త్రజ్ఞులు పరిశీలించారు. ఇది సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి 1,396 సంవత్సరాలు పడుతున్నదని దాని ట్రెజెక్టరీ ధృవీకరిస్తున్నది. చివరిసారిగా 629వ సంవత్సరంలో ఇది భూమికి సమీపానికి వచ్చినట్టు నిర్ధారించారు. మరోసారి 3421వ సంవత్సరంలో మరోసారి భూమిని సందర్శించనున్నది. ఇది క్రమంగా మరింత ప్రకాశవంతం అవుతున్నది. అక్టోబర్ చివరివారంలో దీనిని ఆకాశంలో చూడవచ్చు.
మరో రెండు కూడా దగ్గరగా..
మరో రెండు తోకచుక్కలు కూడా భూమికి దగ్గరగా రానున్నాయి. అయితే.. అవి వచ్చే ఏడాది అంటే 2026లో భూమిపైన ఆకాశంలోకి వస్తాయి. 24P/Schanmasse తోకచుక్క వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన సూర్యుడి సమీపంలోకి, జనవరి 4వ తేదీన భూమి సమీపంలోకి వస్తుంది. C/2024 E1 (Wierzchos) తోకచుక్క ఊర్ట్ మేఘం నుంచి ప్రయాణం చేస్తున్నది. దీనిని గత ఏడాది మార్చి 3న కనుగొన్నారు. ఇది జనవరి 20న సూర్యునికి దగ్గరలోకి, ఫిబ్రవరి 17, 2026న భూమి సమీపానికి చేరుకుంటుంది.