Site icon vidhaatha

COVID 19 । గబ్బిలం కాదు.. కొవిడ్‌కు కారణమైంది ఇదేనంట!

COVID 19 । ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన.. ఇంకా చేస్తూనే ఉన్న కొవిడ్‌-19 వేటి నుంచి విస్తరించిందనే విషయంలో ఇంకా శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. గబ్బిలాల (Bats) నుంచి వచ్చిందని కొందరు, అలుగు (Pangolin) నుంచి వచ్చిందని కొందరు.. అనేక విశ్లేషణలు చేశారు కానీ.. దానిపై ఏకాభిప్రాయం సాధించలేక పోయారు.

ఇప్పడు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి.. చైనాలోని వుహాన్‌ (Wuhan) మార్కెట్‌కు అక్రమంగా విక్రయించిన వైరస్‌ బారిన పడిన రక్కూన్‌ కుక్కలు (Raccoon Dogs) కారణమని విశ్వసించేందుకు బలమైన ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది.

చైనాలోని ఈ భారీ చేపల మార్కెట్‌ నుంచే తొలుత ఈ వైరస్‌ వ్యాప్తి చెందింది. ఇక్కడ సేకరించిన నమూనాల జన్యు వివరాలను పరిశీలించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు.. రక్కూన్‌ కుక్కల నుంచే వైరస్‌ బయటకు వచ్చిందని నిర్ధారణకు వచ్చారు.

ఈ చేపల మార్కెట్‌లోని నేల, గోడలు, చేపలను తరలించే పెట్టెలు తదితరాల నుంచి అనేక నమూనాలను సేకరించారు. ఈ నమూనాలు రక్కూన్‌ కుక్కల జన్యు పదార్థాల (Genetic Material) అవశేషాలను కూడా కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

రక్కూన్‌ కుక్కలు ఇన్‌ఫెక్ట్‌ అయి ఉన్నాయా? వాటి నుంచి మనుషులకు వ్యాపించిందా? అన్న విషయంలో నిర్ధారణకు రానప్పటికీ.. కరోనా వైరస్‌ అడవి జంతువుల నుంచే వ్యాపించిందని చెబుతున్నారు. వుహాన్‌ చేపల మార్కెట్‌లో జంతువులు ఇన్ఫెక్షన్‌తో ఉన్నాయనేందుకు ఇది తిరుగులేని సంకేతమని పరిశోధనలో పాల్గొన్న వైరాలజిస్ట్‌ ఏంజెలా రాస్ముస్సెన్‌ చెప్పారు.

Exit mobile version