Phone tapping case | ఫోన్ ట్యాపింగ్‌లో ఆ ఐదుగురు నేతలే కీలకం?

  • Publish Date - April 11, 2024 / 02:02 PM IST

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు

  • కేసుతో లింక్‌లున్న నేతలకు త్వరలోనే నోటీస్‌లు

  • కదలనున్న రాజకీయ డొంకలు

  • ఓ పార్టీ సుప్రీమ్, ఎంపీ, ఓ ఎంఎల్‌సీ, ఇద్దరు మాజీ మంత్రుల పాత్రపై ఆధారాల సేకరణ

 

విధాత: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతున్న కొద్ధి కీలక మలుపులు..ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావులను అరెస్టు చేసి విచారించిన పోలీసులు ఈ కేసులో రోజురోజుకు కొత్త వివరాలను రాబడుతూ ముందుకెలుతున్నారు. ధ్వంసమైన ఆధారాలను సైతం రిట్రీట్ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి.

గత ప్రభుత్వ పెద్దల రాజకీయ అవసరాల నేపథ్యంలో వారి ప్రోద్భలంతో సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులు టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ, ఏసీపీలు విచారణలో వెల్లడించిన సమాచారం మేరకు పోలీసులు కీలక చర్యల దిశగా అడుగులేస్తున్నారు. ఇందుకు తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తొలిసారిగా స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ట్యాపింగ్‌ కేసు నిష్పాక్షికంగా పారదర్శకంగా సాగుతుందని, సమయానుకూలంగా అన్ని వివరాలు వెల్లడిస్తామని కొత్తకోట స్పష్టం చేశారు.

ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులకు నోటీస్‌లు ఇచ్చే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విధి నిర్వ‌హణలో నిక్కచ్చిగా వ్యవహారించే కొత్తకోట ఫోన్ ట్యాపింగ్ కేసును నిష్పాక్షికంగా విచారించినట్లయితే గత ప్రభుత్వంలోని కీలక తలకాయలకు తల నొప్పులు తప్పకపోవచ్చంటున్నారు రాజ‌కీయ‌ పరిశీలకులు. కొత్తకోట చేసిన వ్యాఖ్యలను విశ్లేషిస్తే త్వరలోనే కేసులో ప్రమేమయమున్న రాజకీయ నేతలకు నోటీస్‌లు వెలువడే అవకాశమున్న‌ట్లు తెలుస్తోంది.

గత ప్రభుత్వ పెద్దలలో ట్యాపింగ్ అలజడి

ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో గతంలో అధికారం చలాయించిన ఓ పార్టీ సుప్రీమ్, ఓ ఎంపీ, ఓ ఎంఎల్‌సీ, ఇద్దరు మాజీ మంత్రులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లుగా పోలీస్ సర్కిల్‌లో ప్రచారం సాగుతుంది. వీరంతా అక్రమాలకు పాల్పడ్డారని నిరూపించేందుకు పోలీసులు పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో తగిన ఆధారాలు బయట పడ్డాయని, ట్యాపింగ్ కీలక సూత్రధారి ఏ1గా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తే పూర్తి విషయాలు బయట పడతాయని పోలీసులు చెబుతున్నారు.

ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేయడం, ఎన్నికల్లో వారి వ్యూహాలు ముందే పసిగట్టడం..వారి డబ్బులను కట్టడి చేయ‌డం వంటి చర్యలకు పాల్పడినట్లుగా, అదంతా తాము అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే చేసినట్లుగా రాధాకిషన్‌రావు సహా ఇతర అధికారులు తమ విచారణలో వెల్లడించిన‌ట్లు తెలిసింది. ఇందుకు తగిన సాక్ష్యాదారాలు సమకూర్చుకుని పక్కా స్కెచ్‌తో కేసులో ప్రమేమయమున్న నేతలకు నోటీస్‌లు జారీ చేయాలని దర్యాప్తు బృందం ఆలోచనగా ఉందంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

గత ప్రభుత్వ పెద్దల హయాంలో రాజకీయ కోణంలో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాస్తా వెర్రితలలు వేసి వ్యాపారులు, సెలబ్రిటీలు, రియల్టర్లు..జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్ చేసే దాకా వెళ్లింది. చివరకు కుటుంబ సభ్యుల, వ్యక్తిగత గోప్యత అంశాలలో ట్యాపింగ్ చొరబడటం.. కానిస్టేబుల్స్ మహిళలపై బెదిరింపులు, బ్లాక్ మెయిళ్లకు పాల్పడినట్లుగా కూడా విచారణ పర్వం నుంచి లీకేజీలు వినిపించాయి. అంతేగాక ట్యాపింగ్ మాటున కిడ్నాప్‌లు వందల కోట్ల బ్లాయిమెయిలింగ్ వసూళ్లు..సెటిల్‌మెంట్ల దందాలను సాగించినట్లుగా విచారణలో వెల్లడవ్వడం సంచలనంగా మారింది.

ఈడీ రాకముందే తేల్చేందుకు ప్రభుత్వం సన్నద్దత

పోన్ ట్యాపింగ్ కేసును బీజేపీ కూడా సీరియస్‌గా తీసుకోవడంతో పాటు ఇటీవల హైకోర్టు న్యాయవాది యూవీ సురేశ్ ప్రివెన్షివ్ ఆప్ మనీలాండరింగ్ యాక్ట్‌(పీఎంఎల్‌ఏ) మేరకు ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరడంతో రాష్ట్ర ప్రభుత్వంపైన, పోలీస్ శాఖపైనే ఒత్తిడి పెంచినట్లు అయింది. ముందస్తు అధికారిక అనుమతులు లేకుండా ట్యాపింగ్ చేయడం.. ఎన్నికల్లో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయడంలో ఎన్నికల నియమాళిని, ప్రజాపాతినిధ్యం చట్టాల ఉల్లంఘన జరిగిందని ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం, దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాలని, బాధ్యులైన రాజకీయ పార్టీ గుర్తింపు రద్ధు చేయాలని బీజేపీ డిమాండ్ లేవనెత్తింది.

ఈ మేరకు గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేసింది. ట్యాపింగ్ కేసులో బ్లాక్ మెయిళ్లు, అక్రమ వసూళ్లు, సెటిల్‌మెంట్లు సాగడంతో పాటు మనీలాండరింగ్‌, హవాల మూలాలు కూడా కేసులో ఉండటం, వ్యక్తిగోప్యత చట్టాలను అతిక్రమించడం, టెలిగ్రాఫ్ చట్టాల ఉల్లంఘనలు జరగడంతో ఈడీ జోక్యం చేసుకుంటే కేసు తమ చేజారిపోవచ్చన్న ఆందోళన రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు అవకాశమివ్వకుండా కేసును త్వరగా తేల్చేందుకు ట్యాపింగ్‌తో ప్రమేయమున్న అప్పటి ప్రభుత్వ పెద్దలను విచారించాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా పోలీస్ సర్కిల్‌లో ప్రచారం సాగుతోంది. పార్లమెంటు ఎన్నికల క్రమంలో అధికార పార్టీ ఫోన్ ట్యాపింగ్ కేసును ఎక్కడ తమ దాకా తీసుకోస్తుందోనన్న ఆందోళన అప్పటి ప్రభుత్వ పెద్దలను కలవరపెడుతున్నప్పటికి పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.

Latest News