విధాత : దేశంలో అందరికి సన్ స్ట్రోక్ ఉంటే.. కేసీఆర్‌కు మాత్రం డాటర్ స్ట్రోక్ ఎదురైందంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దెవా చేశారు. మంగళవారం రఘునాథపాలెం మండలం బాలపేటలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో నారాయణ పాల్గొని మాట్లాడారు. లిక్కర్ స్కాం కారణంగానే బీజేపీకి కేసీఆర్ తలొగ్గారన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ఓటమి ఖాయమని గ్రహించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబును కలవాలని యత్నిస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయితే చంద్రబాబు వారిని కలిసేందుకు ఒప్పు కోలేదన్నారు. చంద్రబాబు అరెస్టు సందర్భంలో కేసీఆర్, కేటీఆర్ ఎలా వ్యవహరించారో అంతా చూశామని, ఇప్పుడేమో బాబు మద్దతు కోసం చూస్తున్నారని నారాయణ విమర్శించారు. యువత, మహిళలు, రైతులు కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగినట్లే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. ప్రశ్నించే గొంతులు నొక్కే కేసీఆర్ పాలనను ప్రజలు తరిమికొట్టాలని అన్నారు.
దళిత, రైతు బంధుపై రాజకీయం తప్ప, దళితులు, రైతులపై ప్రేమ కాదన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన నిరాహార దీక్ష నిజమైంది కాదని… చావు లేకుండా మందులు ఇచ్చారన్నారు. తన అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తాడనే కోదండరామ్‌ను కేసీఆర్ పక్కన పెట్టారన్నారు. మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురు దొంగలేనని, కేసీఆర్ అవినీతి చేశారని చెప్పే బీజేపీ ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్నికలో కేసీఆర్ ఓడిపోయి ఫామ్‌హౌజ్‌కు పరిమితమవుతారన్నారు.
సీపీఐకి ఒక్క సీటా రెండు సీట్లా సమస్య కాదని, బీజేపీ, బీఆరెస్‌ను అడ్డుకోవడమే తమ లక్ష్యమని నారాయణ స్పష్టం చేశారు. అహంభావంలో నెంబర్ వన్ కేసీఆర్.. నెంబర్ టూ కేటీఆర్ నెంబర్ త్రీ పువ్వాడ అజయ్ అని నారాయణ విమర్శించారు. తుమ్మల తులసి మొక్క లాంటోడయితే పువ్వాడ అజయ్ గంజాయి మొక్క లాంటోడన్నారు. పువ్వాడకు సీపీఐ పార్టీ ఓట్లు వేయదని అందుకు తనది గ్యారంటీ అని స్పష్టం చేశారు. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టుగా కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీ, బీఆరెస్, ఎంఐఎంలకు బుద్ధి చెప్పినట్లవుతుందన్నారు.