తెలంగాణ టూరిజం శాఖలో వందల కోట్ల అవినీతి..

తెలంగాణ పర్యాటక శాఖలో వందల కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకున్నదని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు.

  • Publish Date - December 5, 2023 / 10:02 AM IST
  • కాంగ్రెస్‌-కమ్యూనిస్టుల పొత్తుకు జనామోదం


విధాత : తెలంగాణ టూరిజం శాఖలో మంత్రి, ఎండీ కలిసి వందల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు రావడం కంటే ముందు రోజు టూరిజం శాఖ కార్యాలయంలో మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ జరిగి విలువైన డాక్యుమెంట్స్ కాలిపోవడం వెనుక కుట్ర కోణం ఉందన్నారు.


పర్యాటక శాఖ మంత్రి, ఎండీకి తెలిసే ఈ అవినీతి జరిగిందని, ప్రభుత్వం మారిందని తమ అక్రమాలు బయటపడుతాయన్న కోణంలోనే అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని తగలబెట్టారన్నారు. తెలంగాణ కొత్త ప్రభుత్వం టూరిజం శాఖలో జరిగిన అవినీతితో పాటు బీఆరెస్ ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలన్నారు.


హైద్రాబాద్‌ చుట్టుపక్కల విలువైన టూరిజం భుములను అప్పనంగా లీజుకు ఇచ్చి అవినీతికి పాల్పడ్డాని, కొత్త ప్రభుత్వం దీనిపై జ్యుడిషియరీ విచారణ జరిపించాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవస్థలను ధ్వంసం చేస్తోందని నారాయణ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తును ప్రజలు ఆమోదించారని, ఏపీలో పొత్తులపై పార్టీల మధ్య స్పష్టత లేదన్నారు.


సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల పాలనలో ఊపిరాడని నిర్భంధాలు అమలు జరిగాయని, బంగారు తెలంగాణను చేస్తానన్న కేసీఆర్ ఎన్నికల హామీలను, ఉద్యమ హామీలను విస్మరించి అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన సాగించాడన్నారు. నిర్బంధాలను సహించబోమని తెలంగాణ ప్రజానీకం స్పష్టమైన తీర్పునిచ్చింది.


కాంగ్రెస్, సీపీఐ పొత్తు ఎన్నికల్లో విజయవంతమైందని, టీడీపీ, సీపీఎం, టీజేఎస్‌లు కూడా మద్దతిచ్చాయన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించారని, పదేళ్లుగా ఏం చేయలేని వ్యక్తి.. ఇప్పుడేం చేస్తారనే కేసీఆర్‌ను ప్రజలు ఓడించారని కూనంనేని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతా ఐక్యంగా పనిచేయడం వల్ల తెలంగాణాలో విజయం సాధించిందని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు.