సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే ఓయులో ప్రచారం చేయాలి: సీపీఐ నారాయణ

సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రచారం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సవాల్ చేశారు.

  • Publish Date - November 24, 2023 / 08:35 AM IST
  • మోడీకి దాసోహంతోనే జగన్‌, కేసీఆర్‌, కవితలు బయట
  • బీజేపీతో కలవనందుకే బాబుకు జైలు
  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ


విధాత : సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రచారం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సవాల్ చేశారు. శుక్రవారం ఖమ్మంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. సీఎం కేసీఆర్ తన కూతురు కవితను లిక్కర్ స్కామ్ నుంచి రక్షించుకునేందుకు కేంద్రంలోని బీజేపీకి, ప్రధాని మోడీకి దాసోహమయ్యారన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వనందుకే టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపారని ఆరోపించారు. కేంద్రం కాళ్లపై పడటంతోనే పదేళ్లుగా ఏపీ సీఎం జగన్ బెయిల్‌పై బయట ఉన్నారన్నారు. స్వతంత్ర భారతంలో ఇంతకాలం బెయిల్‌పై ఉన్న వ్యక్తి జగన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు.


మూడు రాజధానిల పేరుతో ఏపీ సీఎం జగన్ చివరకు ఏపీకి రాజధాని లేకుండా చేశారన్నారు. సుప్రీంకోర్టులో రాజధాని కేసు పెండింగ్‌లో ఉండగానే విశాఖకు ప్రభుత్వ శాఖల తరలింపు అన్యాయమన్నారు. కృష్ణా నదితో విశాఖకు ఏమాత్రం సంబంధం లేదని, కృష్ణానదీ యాజమాన్య బోర్డును విశాఖకు తరలించడం ఎందుకని ప్రశ్నించారు. తండ్రికి మూడు నామాలు పెట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే అది పువ్వాడ అజయ్‌నే అని.. తండ్రినే మోసం చేశారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో మొదట ఓడేది పువ్వాడ అజయ్‌ అని.. ఆయనకు అహం బాగా పెరిగిపోయిందన్నారు. ఇండియా కూటమిలో తాము భాగస్వాములమన్నారు.


ప్రియాంకగాంధీ ఖమ్మం సభలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఇవాళ జాతీయ నాయకులు టి.రాజా ఖమ్మం వస్తున్నారన్నారన్నారు. కొత్తగూడెంలో సీపీఐ విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చాలా ముదుర్లని, ఐదు సీట్లు అడిగితే తమకు ఒక్క సీటే కేటాయించారని తెలిపారు. వివేక్ గద్దలా తమకు కేటాయించాల్సిన సీటు ఎత్తుకుపోయారని విమర్శించారు. రాజాసింగ్ కరుడుగట్టిని హిందుత్వవాదన్నారు. తాము మునుగోడు ఎన్నికల్లో బీఆరెస్‌తో కలిసి ఎన్నికలకు వెళ్లామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ వరకు బీజేపీ బలంగా ఉందని, ఇప్పుడు జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందన్నారు.